జ‌గ‌న్‌కు ష‌ర్మిల షార్ప్ కౌంట‌ర్‌

త‌మ‌కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌వ‌చ్చ‌ని.. అలా ఇవ్వ‌న‌ప్పుడు తాము స‌భ‌ల‌కు వెళ్లినా.. ప్ర‌యోజ‌నం ఏంట‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. త‌మ‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోతే.. అసెంబ్లీకి వెళ్లేది లేద‌ని.. స‌భ‌లో త‌మ‌పై చేసే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్‌గా.. తాము మీడియా స‌మావేశాలు పెట్టి నిజాలు చెబుతామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

అయితే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. ఇదే స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. ఆయ‌న షార్ప్ కౌంట‌ర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ల‌న‌ప్పుడు.. మీకు ప‌ద‌వులు ఎందుకు? రాజీనామాలు చేయండి.. అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎంఎల్ ఏ అంటే.. శాస‌న స‌భ్యులు అని, మీడియా అసెంబ్లీ స‌భ్యులు కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఆ 11 మందిని గెలిపించింది.. చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తార‌నే న‌మ్మ‌కంతోనేన‌ని, మీడియా ముందు సొంత డ‌బ్బా కొట్టుకునేందుకు కాద‌ని అన్నారు. ఇదే విష‌యాన్ని కూడా ప్ర‌శ్న‌ల రూపంలో సంధించారు.

ఆ బాధ్య‌త లేదా?

అసెంబ్లీలో గ‌త ప్ర‌భుత్వ అవినీతి, అక్ర‌మాలు, దందాలు, దోపిడీపై ప్ర‌స్తుత ప్ర‌బుత్వం శ్వేత ప‌త్రాల రూపంలో వివ‌రాలు తెలిపింద‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు అసెంబ్లీలోనే ఆన్ రికార్డుగా మీరు స‌మాధానం ఇచ్చుకోవాల్సి ఉంద‌ని.. ఆ బాధ్య‌త మీది కాదా? అని నిల‌దీశారు. అసెంబ్లీకి వెళ్ల‌న‌ని చెబుతున్న మీకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు? అస‌లు మీరు ఎమ్మెల్యేగానే అర్హులు కారు. వెంట‌నే రాజీనామాలు చేయండి! అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి పోను అంటూ.. గౌర‌వ స‌భ‌ను అవ‌మానించిన వాళ్ల‌కు ఎమ్మెల్యేగా ఉండే అర్హ‌త లేద‌న్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ల‌న‌ప్పుడు.. మీరు ఆఫ్రికా అడ‌వుల‌కు పోతారో.. అంటార్కిటికా మంచు ఖండానికి పోతారో.. ఎవడికి కావాలి. అసెంబ్లీకి పోని జ‌గ‌న్ అండ్ కో.. త‌క్ష‌ణం రాజీనామాలు చేయాలి.. అని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యంగ్యాస్త్రాలు సైతం సంధించారు. బ‌డికి పోన‌నే పిల్ల‌వాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోన‌నే ప‌నిదొంగ‌ను వెంట‌నే ప‌నిలోంచి తీసేస్తారు. ఇప్పుడు ప్ర‌జాతీర్పున గౌర‌వించ‌కుండా.. అసెంబ్లీకి పోనంటూ.. గౌర‌వ స‌భ‌ను అవ‌మానించేవారు రాజీనామాలు చేయాలి అని అన్నారు.