పెద్దిరెడ్డి అనుచ‌రుల ప‌రార్‌.. పుంగ‌నూరులో హైటెన్ష‌న్‌

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో హైటెన్ష‌న్ నెల‌కొంది. మ‌ద‌న‌ప‌ల్లెలోని స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వారం కింద‌ట సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో 2400ల‌కు పైగా భూముల రికార్డులు ద‌గ్ధ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న రాష్ట్ర సర్కారు ఉన్న‌తాధికారుల‌ను రంగంలోకి దింపి నిశితంగా విచార‌ణ చేస్తోంది. అక్ర‌మంలో ఇప్ప‌టికే 2 వేల మంది పైగా భూ భాదితులు త‌మ భూముల‌ను మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రులు, వైసీపీ నాయ‌కులు దోచుకున్నార‌ని.. బెదిరించి రిజిష్ట్రేష‌న్లు కూడా చేయించుకున్నార‌ని ఫిర్యాదు చేశారు.

ఆయా కేసుల‌ను కూడా అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు ఎస్పీ స్థాయి అధికారిని నియ‌మించి ఆఘ‌మేఘాల‌పై విచార‌ణ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు పుంగ‌నూరు స‌హా మ‌ద‌న‌ప‌ల్లె, చిత్తూరుల్లో వైసీపీ నాయ‌కులు కంటికి కూడా క‌నిపించ‌కుండా మాయ‌మైపోయారు. ముఖ్యంగా పెద్ది రెడ్డి అనుచ‌రులుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు చ‌లామ‌ణి అయిన వారు కూడా.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం స‌హా .. జిల్లా నుంచి వెళ్లిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన అధికారులు వారి విష‌యంలో మ‌రింత వేగంగా విచార‌ణ చేప‌ట్టారు.

ఏం జ‌రిగింది?

పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కొట్టిన పిండి. గ‌త 40 ఏళ్లుగా ఆయ‌న ఇక్క‌డ గెలుస్తూ వ‌స్తున్నారు. అయితే.. ఆయ‌న గ‌త ఐదేళ్ల‌లో మంత్రిగా ఉండ‌డంతో ఇక్క‌డ భారీ ఎత్తున అసైన్డ్ భూములు, 22ఏ ప‌ట్టాలు.. వంటివాటిని మార్పు చేసి.. కొంద‌రి నుంచి బ‌లవంతంగా ఆయ‌న అనుచులు ద‌క్కించుకున్నార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. అప్ప‌ట్లోనే వైసీపీ వీటిపై స్పందించినా.. పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇంత‌లోనే 2 వేల ఎక‌రాల‌కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావ‌డంతోపాటు బాధితుల‌ను బెదిరించి కొంద‌రు పెద్దిరెడ్డి అనుచ‌రులు రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు, నారా లోకేష్ వంటి కీల‌క నాయ‌కులు పెద్దిరెడ్డి బాగోతాన్ని తాము అధికారంలోకి వ‌చ్చాక తేలుస్తామ‌ని.. ప్ర‌స్తావించారు. ప్ర‌చారంలోకూడా పెద్దిరెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అన్న‌ట్టుగానే రేపో మాపో.. ఆయా అంశాల‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు భావించారు. ఇంత‌లోనే కీల‌క‌మైన 22ఏ, అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డులు భ‌ద్ర ప‌రిచిన స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గ‌త ఆదివారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో అగ్ని ప్ర‌మాదం(ఉద్దేశ పూర్వ‌కంగా కొంద‌రు చేశార‌ని అధికారులు గుర్తించారు) సంభ‌వించి.. అవ‌న్నీ కాలిపోయాయి.

దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశించింది. ఫ‌లితంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి అన‌చ‌రులు పారిపోయారు. ఇదిలావుంటే.. ఇన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి మాత్రం మీడియా ముందుకు రాక‌పోవ‌డం.. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంగ‌మ‌నార్హం. ఆయ‌న కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం ఒక్క‌సారి స్పందించారు.