ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే.అయితే.. ఇప్పటి వరకు ఓడిన వారు మాత్రమే పార్టీ మారుతుండగా.. తమకు కొంత మేరకు బలం ఉందని ధైర్యంతో ఉన్న వైసీపీకి అదే బలం తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాసన సభలో వైసీపీకి బలం లేదు. కానీ, శాసన మండలిలో మాత్రం వైసీపీకి బలం ఉంది.
ఇక్కడే ఇప్పుడు వైసీపీకి దెబ్బలు తగిలే పరిస్థితి ఏర్పడింది. తాజాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మైనారిటీ నాయకురాలు.. జకియా ఖానుం.. టీడీపీలోకి చేరడం దాదాపు ఖరారైపోయింది. నంద్యాల జిల్లాకు చెందిన జకియా ఖానుంను వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మైనారిటీ కోటాలో ఆమెకు మండలి స్థానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎంతో మంది పోటీలో ఉన్నా.. వారిని కూడా కాదని.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమెకు మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవిని ఇచ్చారు.
ఇది జరిగి ఏడాది కూడా కాకముందే.. వైసీపీ అధికారం కోల్పోవడం.. 11 స్థానాలకు పడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే జకియా ఖానుం పార్టీ మార్పు దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. కొన్నాళ్ల కిందట నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్‌ను కలుసుకుని.. రెండు రోజులపాటు చర్చించారు. తాజాగా ఆయన సూచనల మేరకు.. శుక్రవారం తన కుటుంబంతో సహా వచ్చిన ఆమె.. మంత్రి నారా లోకేష్‌ను అసెంబ్లీలో కలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో జకియా ఖానుం ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవడం కూడా ఖాయమైపోయిందని టీడీపీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మంత్రి ఫరూక్ సూచనలు, సలహాల మేరకే.. ఆమె నారా లోకేష్‌ను కలిశారని.. ఇక, చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరడమే ఆలస్యమని అంటున్నారు. ఇక, ఈమె రాకతో.. బలమైన మైనారిటీ వర్గాలు టీడీపీ వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.