ఏపీలో మొత్తం జనాభా 5 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై 1.44 లక్షల రూపాయల అప్పు ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మొత్తం అప్పులు 9.74 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. (అయితే..ఇది మొత్తం అప్పా.. వైసీపీ మాత్రమే చేసిన అప్పా అనేది చెప్పలేదు) దీంతో ఒక్కొక్కరిపై భారం పెరిగిపోయిందని చెప్పారు. దీనికి వేల కోట్ల రూపాయల్లో వడ్డీలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీకి 46 శాతం, తెలంగాణకు 54 శాతం ఆదాయం ఉందన్నారు.
అయితే… తమ హయాంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదాయం బాట పట్టించామని చంద్రబాబు చెప్పారు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టును కట్టడం ద్వారా 44 వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చిందని చంద్రబాబు వివరించారు. కానీ, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని కొనసాగించలేదని.. టీడీపీకి పేరు వస్తుందని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని దీంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిని.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు తమ హయాంలో 11 వేల కోట్ల రూపాయలకు పైగానే కేటాయించామని చంద్రబాబు చెప్పారు. ఇదే విధానాన్ని కొనసాగించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని.. కానీ, వైసీపీ రివర్స్ టెండర్లు వేయడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి చేరిపోయిందన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువతను తయారు చేశామని.. అనేక మంది వైసీపీ హయాంలో ఉద్యోగాలు, ఉపాధి లేక.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని, దీంతో నైపుణ్య ఉద్యోగులు లేక రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందన్నారు.