ఏపీలో అన్ని రోడ్లకు టోల్?

ఏపీలో ర‌హ‌దారుల దుస్థితి అంద‌రికీ తెలిసిందే. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చేసింది. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ర‌హ‌దారుల దుస్థితి ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. ర‌హ‌దారుల దుస్తితిపై స్పందించారు. 2022 , అక్టోబ‌రు 2న ఆయ‌న శ్ర‌మ‌దానం పేరుతో ర‌హ‌దారుల‌ను బాగు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

ఆ త‌ర్వాత ఇంకేముంది.. బాగు చేస్తున్నాం.. అద్భుత‌మైన రోడ్లు వేస్తున్నాం.. వ‌ర్షాలు త‌గ్గ‌నివ్వండి అని చెప్పిన అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం త‌ర్వాత‌ కూడా.. ర‌హ‌దారుల దుస్థితిని ప‌ట్టించుకోలేదు. దీంతో గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు కూడా..రోడ్లు ఛిద్ర‌మై.. గుంత‌లు ప‌డి.. రాజ‌కీయంగా కూడా దుమారం రేగింది. పొరుగు రాష్ట్రాల మంత్రులు సైతం.. వీటిపై కామెంట్లు చేశారు. అయినా.. వైసీపీలో చ‌ల‌నం క‌నిపించ‌లేదు. అలానే ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఫ‌లితంగా చిత్తుగా ఓడిపోయింది.

ఇక‌, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న ర‌హ‌దారుల విధానాన్ని తీసుకువచ్చేందుకు మార్గం రెడీ చేసుకుంది. గ్రామ, మండల స్థాయిలో టోల్ విధానం అమ‌లు చేయాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేసిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు పేర్కొన్నారు. గుంతలు పడిన రోడ్లను ఇప్పటికిప్పుడు బాగుచేసే ఆర్ధిక వెసులుబాటు లేదని.. ఈ నేప‌థ్యంలో ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్‌షిప్‌(పీపీపీ) విధానంలో ర‌హ‌దారుల‌ను అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ ప్ర‌కారం.. ప్రతి పల్లె నుండి, మండల కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి రోడ్ల పునరుద్ధరణ చేస్తారు. ట్రాక్టర్లు, బైక్, స్కూటర్లు, ఆటోలను మినహాయించి…. మిగిలిన వాహనాలకు టోల్ వసూలు చేయ‌నున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ఖాతాకు చేరుతుంది. ఇందులో వచ్చే వయబులిటి గ్యాప్ ను ప్రభుత్వం భరించి ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై త్వ‌ర‌లోనే రూట్ మ్యాప్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.