రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించండి: ష‌ర్మిల లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల లేఖ సంధించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితి ముఖ్యంగా రైత‌న్న‌ల ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని తెలిపారు. ఇటీవ‌ల బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీ డ‌నం కార‌ణంగా కురిసిన వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌లు పోటెత్తి.. రాష్ట్రంలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఇత‌ర ప్రాంతాల్లోని రైతులు.. తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ష‌ర్మిల తెలిపారు. ఈ నేప‌థ్యంలో రైతుల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఫార్మ‌ర్‌ ఎమ‌ర్జెన్సీ’ని ప్ర‌క‌టించాల‌ని ఆమె కోరారు.

అదేవిధంగా స‌ర్కారు తీరును కూడా ష‌ర్మిల ఆక్షేపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు న‌ష్ట‌పోయి.. తీవ్ర దుఖంలో ఉంటే.. కేబినెట్ మంత్రులు.. కూట‌మి ప్ర‌భుత్వంలోని నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా స్పందించ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రైతుల‌కు అనేక హామీలు గుప్పించార‌ని.. కానీ, ఎన్నిక‌లు అయ్యాక వారిని క‌నీసం ప‌ల‌కరించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేద‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పొలాలు మునిగిపోయ‌ని తెలిపారు.

ప‌లు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని, రాష్ట్ర ప్ర‌తినిధి బృందాన్ని పంపించి.. రైతుల క‌ష్టాలు ఆల‌కించాల‌ని ష‌ర్మిల కోరారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కోరుతున్నామ‌ని ష‌ర్మిల తెలిపారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను పంపించాల‌ని కోరారు. అదేవిధంగా కేంద్రంపైనా ఒత్తిడి తీసుకురావాల‌ని.. వ‌ర‌ద‌ల‌ను విప‌త్తుల ప‌రిధిలో చేర్చి.. రాష్ట్రమే కాకుండా.. కేంద్రం నుంచి కూడా రైతుల‌కు సాయం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

జ‌గ‌న్‌ను వ‌దల్లేదు!

అయితే.. ఈ సంద‌ర్భంగా కూడా.. ష‌ర్మిల త‌న సోద‌రుడు జ‌గ‌న్ ను వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త వైసీపీ పాల‌నలో రైతుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు డ‌బ్బులు బ‌కాయిలు పెట్టింద‌ని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి.. కూడా సొమ్ములు చెల్లించ‌లేద‌ని.. కాబ‌ట్టి.. ఇప్పుడు ఆ బ‌కాయిలును కూడా ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని ష‌ర్మిల కోరారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులు మీరు చేయొద్దంటూ.. చంద్ర‌బాబుకు సూచించ‌డం గ‌మ‌నార్హం.