కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు.

ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారనే అభిప్రాయం జనంలోనూ వ్యక్తమవుతోంది. ప్రతిపక్షం గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు అధికార పార్టీ నేతలు.. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.

తాజాగా అసెంబ్లీలో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జగన్ సర్కారు హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ లేచి నిలబడమని చంద్రబాబు గురువారం కోరగా.. ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలుచున్నారు.

బాబు ఇలా అడగ్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. ఈ నంబర్ వంద దాటినా ఆశ్చర్యం లేదు. కేసులు లేకుండా కింద కూర్చున్న వాళ్లు చాలా తక్కువమంది.

గత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన, పోరాడిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెట్టి వేధించారనడానికి ఇది రుజువు అని.. ఐతే జనం మాత్రం దీన్ని వేరే దృష్టితో చూశారని.. ఎవరు ఎక్కువ పోరాడి ఉంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారిని అంత భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు అన్నారు. దీంతో అసెంబ్లీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.