ఏపీలో గత వైసీపీ పాలనకు సంబంధించి జరిగిన పలు విషయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్వేతప త్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
దీంతో అనేక సంస్థలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పయ్యావుల తెలిపారు. మొత్తంగా రూ.లక్షా 41 వేల 588 కోట్ల మేరకు బిల్లుల పెండింగు ఉన్నట్టు లెక్క తేలినట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదన్నారు. అదేవిదంగా కాంట్రాక్టర్లకు.. 93 వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చినట్టుగా చూపించినా.. ఎక్కడా ఇచ్చినట్టు రుజువు లేదని చెప్పారు.
మరిన్ని వివరాలు..
- మొత్తం పెండింగు బకాయిలు: రూ.1,41,588 కోట్లు
- రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేయలేదు.
- రూ.48 వేల కోట్ల కు సంబంధించిన బిల్లులు సీఎఫ్ ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేసినా నిధులు విడుదల చేయలేదు.
- భారీగా పెండింగు పెట్టిన శాఖలు నీటి పారుదల శాఖ, పోలవరం ప్రాజెక్టు పనులకు
- మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగులో ఉన్న బకాయిలు: రూ.19,324 కోట్లు
- కేవలం ఆర్థిక శాఖ వద్దే పెండింగులో ఉన్న బిల్లుల మొత్తం రూ.19,549 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బకాయిలు: రూ.14 వేల కోట్లు
- మున్సిపల్ శాఖలో బకాయిలు: రూ.7,700 కోట్లు.