చంద్ర‌బాబు మారిన‌ట్టున్నారే.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు మారిన‌ట్టుగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు పాల‌న అంటే.. సుదీర్ఘ స‌మీక్ష‌లు, అర్థ‌రాత్రి వ‌ర‌కు మీడియా మీటింగులు.. మైకు క‌నిపిస్తే వదల‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి ఉప న్యాసాలు ఇచ్చే విధానం వంటివి గుర్తుకు వ‌స్తాయి. ఇక‌, అప్పుడప్పుడు త‌నిఖీల పేరుతో ఆయ‌న అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డం కూడా.. తెలిసిందే. దీని వ‌ల్ల పాల‌న తీరు ఎలా ఉన్నా.. అధికారులు, సిబ్బంది విష‌యంలో మాత్రం ఆయ‌న వ్య‌తిరేక‌త పెంచుకున్నారు.

ఈ ప‌నితీరు కార‌ణంగానే ఒక‌సారి అధికారం కూడా కోల్పోయారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఏంటంటే.. సుదీర్ఘ స‌మీక్ష‌ల‌కు ఇక స్వ‌స్తి చెబుతున్న‌ట్టు తెలిపారు. గంట‌ల త‌ర‌బ‌డి తాను స‌మీక్ష‌లు చేయ‌బోన‌ని.. అయితే.. అధికారులు తమ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్టి తామే యంత్రాంగాల‌ను న‌డిపించుకోవాల‌న్నారు. తాను కేవ‌లం సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పారు. అదేస‌మయంలో అవినీతి, అక్ర‌మాల‌ను స‌హించేది లేద‌న్నారు.

ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే.. ప్ర‌స్తుతం మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నా.. త‌న మార్కు కోసం చంద్ర‌బాబు త‌పిస్తార‌నేది తెలిసిందే. అయితే.. అంతా అధికారుల‌కే అప్ప‌గిస్తే.. చంద్ర‌బాబు మార్కు క‌నిపిస్తుందా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న సామాజిక మాధ్య మాల వేగం పాల‌న‌పై ప్ర‌భావం చూపిస్తోంది. ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లోనే తెలిసిపోతోంది. ఒక్కొక్క‌సారి .. అధికారులు ఈ మాధ్య‌మాల వేగాన్ని సైతం అందుకోలేక పోతున్నారు.

ఏదేమైనా.. చంద్ర‌బాబు దూకుడు త‌గ్గిస్తాన‌ని చెప్ప‌డం ద్వారా అధికార యంత్రాగానికి ఫ్రీహ్యాండ్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా కొంత మేర‌కు.. ఆయ‌న ఒత్తిడి నుంచి దూర‌మ‌వుతున్నారు. అయితే.. ఆయన మార్కను త‌గ్గించుకోకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అనేక సంక్లిష్ట‌త‌లు ఉన్న ఏపీలో ఇప్పుడు చంద్ర‌బాబు మార్క కోసం.. ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. మ‌రి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.