వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నాయకుడు బోడే రామచంద్రయాదవ్ దాఖలు చేశారు.
ఇదీ.. ఆరోపణ
“పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే.. ఆయన ఆయా ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపి.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి”.
ఈ పిటిషన్‌ను హైకోర్టు..విచారణకు తీసుకుంది. తాజాగా జరిగిన విచారణకు ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజరయ్యారు. “పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి. ఇంప్లీడ్ చేయండి” అని హైకోర్టు ఆదేశించింది.
యాదవ్ చెబుతున్న ఆస్తులు ఇవే..
పెద్దిరెడ్డి అఫిడవిట్‌లో చూపకుండా దాచిన ఆస్తుల వివరాలు ఇవీ..
- 142 భూములకు సంబంధించి రికార్డులు పెద్దిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్నాయి.
- ఈనాం భూములను తమ వారి పేరుతో రాయించుకున్నారు. వాటిని కూడా దాచి పెట్టారు.
- హైదరాబాద్, ఢిల్లీ, ఇతర విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తోంది.
- దక్షిణాఫ్రికాలో గనుల వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను వెల్లడించలేదు.
- బెంగళూరులో విలాస వంతమైన భవనం, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. వాటి వివరాలను కూడా దాచి పెట్టారు.
- పెద్దిరెడ్డిపై 12 కేసులు ఉండగా.. నాలుగు మాత్రమే ఉన్నాయని చూపించారు.