జగన్ ధర్నా.. ఢిల్లీ దద్దరిల్లిందా?

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు.. ఇక్కడ జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం ధర్నా కార్యక్రమం తలపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ దెబ్బతో ఢిల్లీ దద్దరిల్లిపోతుందని.. జగన్ ఏంటో ఇప్పుడు చూస్తారని.. దేశవ్యాప్తంగా ఏపీలో కూటమి అకృత్యాలపై చర్చ జరిగిపోతుందని.. ఇలా ఒక రేంజిలో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు వైసీపీ మద్దతుదారులు. నాలుగు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దీని గురించే మాట్లాడుతూ వచ్చారు. వాట్సాప్ స్టేటస్‌ల్లో కూడా దీని గురించే ప్రచారం చేశారు.

ఇప్పుడు ధర్నా డే రానే వచ్చింది. జగన్ అండ్ కో ఢిల్లీ వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అఖిలేష్ యాదవ్ లాంటి కొందరు ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ పాల్గొనడం మొక్కుబడిగానే సాగింది. జగన్‌కు సంఘీభావం ప్రకటించారే తప్ప.. ఏపీలో కూటమి ప్రభుత్వం పెద్దగా మాట్లాడిందేమీ లేదు. అసలు అఖిలేష్ తప్ప పేరున్న నాయకులెవ్వరూ జగన్ నిరసన కార్యక్రమం దగ్గరికి రాకపోవడమే.. ఢిల్లీలో జగన్ పలుకుబడి ఎలాంటిదో తేటతెల్లం చేసింది.

ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు ఏదైనా కార్యక్రమం చేపట్టి అది విజయవంతం కావాలన్నా.. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నా.. నేషనల్ మీడియా కవరేజీ చాలా ముఖ్యం. వాళ్లు కవర్ చేస్తేనే మైలేజీ వస్తుంది. కానీ జగన్ ధర్నా కార్యక్రమాన్ని నేషనల్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. గతంలో అధికారంలో ఉండగా జగన్ నేషనల్ మీడియాతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఏదైనా అంశం మీద నేషనల్ మీడియా ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాడు. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి నేషనల్ మీడియా ఆయన్ని పట్టించుకునేది. కానీ ఇప్పుడు చిత్తుగా ఓడిపోవడంతో ఆయన్ని లైట్ తీసుకున్నారు. మన లోకల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులే అక్కడా కనిపించారు.

జగన్ ధర్నా ప్రభావం ఢిల్లీ మీద ఏమాత్రం కనిపించనట్లే భావించాలి. ఈ కార్యక్రమం మొక్కుబడిగానే సాగిపోయింది. ఇదిలా ఉంటే.. జగన్ ప్రధాని అవుతారంటూ ఒక నాయకుడు చేసిన కామెంట్ ట్రోల్ మెటీరియల్‌గా మారడం గమనార్హం.