బూమ్ బూమ్ పై సీఐడీ విచారణ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ ఈరోజు సభలో క్లారిటీనిచ్చారు. ఇంట్లోని ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు తల్లికి వందనం పథకం కింద ఇస్తామని, కాకపోతే విధివిధానాలు రూపొందించడంలో కాస్త ఆలస్యం అవుతోందని లోకేష్ అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మద్యంపై సీఎం చంద్రబాబు సభలో శ్వేత పత్రం విడుదల చేశారు. ఆ తర్వాత గత ఐదేళ్లలో మద్యం పాలసీ, మద్యం బ్రాండ్లు, ఆదాయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తెచ్చిన మద్యం పాలసీపై సీఐడీ విచారణ చేపడతామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.

2019-24లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానంపై సీఐడీ విచారణ చేపట్టాలని సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేశారు. దానికి స్పందించిన చంద్రబాబు సీఐడీ విచారణ చేపడతామన్నారు. సీఐడీ విచారణలో వాస్తవాలు తేలుస్తామని, మొత్తం నగదు లావాదేవీలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. మద్యం షాపుల్లో చాలా రోజులు డిజిటల్ చెల్లింపులు జరగలేదని గుర్తు చేశారు. బూమ్ బూమ్ అంటూ వింత వింత పేర్లు పెట్టారని మద్యం బ్రాండ్లపై చంద్రబాబు వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గత ఐదేళ్లలో గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్యలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ అని, పాలనా…పాలకుడు ఎలా ఉండకూడదు అనేది దీన్ని చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ లెక్కలేనన్ని తప్పులు చేశారని, ఎంతో బాధతో ఎక్సైజ్ విధానం పై తాను ఈ రోజు శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సి వస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం తెస్తామని హామీ ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని, కానీ అది కమిట్మెంట్ లేని హామీ అని, మనసులో వేరే ఉద్దేశాలు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు.

మద్యం రేటు పెంచితే వినియోగం తగ్గుతుందని కబుర్లు చెప్పారని, ఇదే కుర్చీలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే అందరూ విన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కానీ అధికారంలోకి రాగానే అడ్డగోలుగా రేట్లు పెంచేందుకు జీవోలు తెచ్చుకున్నారని, ఇది పిచ్చితనం అని బుర్ర ఉన్నవాడు ఎవడు ఇటువంటి పనులు చేయడని చంద్రబాబు అన్నారు. ఈ అస్తవ్యస్త విధానం వల్ల ఎక్సైజ్ శాఖలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయని చెప్పారు. ఇక, 2020లో జీవో నెంబర్ 256 తీసుకొచ్చారని, ఆ తర్వాత మళ్లీ రేట్లు తగ్గించారని చంద్రబాబు అన్నారు.

2019లో మద్యపాన శాతాన్ని తగ్గిస్తానని చెప్పిన ప్రభుత్వం 2024 చివరకు దానిని పెంచిపోయిందని చెప్పుకొచ్చారు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో దొరికే లిక్కర్ బ్రాండ్లు ఏపీలో దొరకకుండా చేశారని, ప్రజలకు ఇష్టం లేకుండా నాసిరకం బ్రాండ్లను షాపుల్లో ఉంచి బలవంతంగా అమ్మారని ఆరోపించారు. ఆ రకంగా ఏపీలో మద్యంపై ఆదాయం తగ్గిపోయిందని, ఆ ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిదని ఆరోపించారు.