మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే తాను భిన్నం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటాడు. ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి మొదట్నుంచి భిన్నమే. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పవన్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించండి అంటూ ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం విశేషం.
అంతే కాక తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పు చేసినా సహించేది లేదని.. వాళ్లను నియంత్రించే బాధ్యత తనదని పవన్ పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వానికి ఎవ్వరు ఇబ్బంది కలిగించినా ఉపేక్షించేది లేదని చెప్పిన పవన్.. ఇంతకుముందు పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలనే అసెంబ్లీలో గుర్తు చేసి మరీ తన పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే తప్పు చేస్తే తనైనా శిక్షించాలని పవన్ వ్యాఖ్యానించారు.
‘‘నా లాంటి వాడు కూడా తప్పులు చేసినా అధ్యక్షా.. నిస్సందేహంగా నా లాంటి వాడిని కూడా శిక్షించాల్సిందే. అలాంటి బలమైన సంకేతాలు ప్రజలకు పంపించాలి అధ్యక్షా. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా మనమే దాని మీద చర్యలు తీసుకోకపోతే కష్టం. నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను. నా ద్వారా ఏదైనా తప్పులు జరిగినా.. అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి.
అది ఎలాంటి విషయమైనా సరే. కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తే అలాంటి వారిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంతకుముందే స్పష్టంగా తెలియజేశాను. ఇసుక విధానంలో కానీ, మైనింగ్ విధానాల్లో కానీ.. గత ప్రభుత్వం చేసింది కదా మేం కూడా చేస్తాం అని.. ఎవరైనా జనసేన తరఫున ఎవరైనా ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, సరి చేసే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని పవన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయానికీ తన మద్దతు ఉంటుందని ఆయన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates