వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ అచంట లక్ష్మోజీపై దాడి జరిగింది. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకొని వస్తున్న లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో లక్ష్మోజీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుడివాడ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు అతన్ని తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యేగా ఇటీవల ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవడంతో లక్ష్మోజీ ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్ లోని పౌరసరఫరాల విభాగం ఆర్ఐగా తిరిగి విధుల్లో చేరి పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకొని మచిలీపట్నం నుంచి రైలులో గుడివాడ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో తన ద్విచక్ర వాహనాన్ని తీస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. దాడి అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ గంగాధరరావు గుడివాడ చేరుకొని సీఎస్ఐ చర్చి వద్ద ఘటన స్థలిని పరిశీలించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని బయటకు రావడం లేదు. ఈ దాడి వెనక వ్యక్తిగత కక్ష్యలు ఉన్నాయా ? గత ప్రభుత్వంలో నాని పీఏగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ? అన్న అనుమానాలు నెలకొన్నాయి.