ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుబెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సభలో నినాదాలు చేస్తున్నారు. హత్యారాజకీయాలు నశించాలి..సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.
అసెంబ్లీకి వచ్చే ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు పూలమాలలు వేశారు. అదే సమయంలో అసెంబ్లీకి నల్ల కండువాలతో వెళ్లేందుకు ఏపీ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నల్ల కండువాలు, ప్లకార్డులతో వస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జగన్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ఈ సమావేశాల్లో శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలో బుధవారం నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం నాడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీకి రావాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో, మంగళవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. మరి, గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వారు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ ఎల్పీ భేటీ జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates