వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా కూట‌మి వ్యూహం..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంటీరియం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. కేవ‌లం వ‌చ్చే మూడు మాసాల‌కు(ఆగ‌స్టు-అక్టోబ‌రు) మాత్ర‌మే బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంద‌ని మ‌రో ప్ర‌చారం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. స‌రే.. మొత్తానికి సోమ‌వారం నుంచి స‌భ అయితే.. ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రోజుల పాటు ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. బ‌డ్జెట్‌తో పాటు.. శ్వేత‌ప‌త్రాల‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

ముఖ్యంగా ఈ స‌మావేశాల ద్వారా.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, కేంద్ర నిధుల దారిమ‌ళ్లింపు.. త‌ద్వారా ప్ర‌స్తుతం ఖ‌జానా కొల్ల‌బోయిన ప‌రిస్థితుల‌ను కూట‌మి స‌ర్కారు ప్ర‌క‌టించ‌నుంది. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కారు అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల్సి ఉంది. దీనిపై ప్ర‌తిప‌క్షం వైసీపీ యాగీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఖ‌జానా ప‌రిస్థితిని.. జ‌గ‌న్ పాల‌న‌లోని డొల్ల‌త‌నాన్ని వివరించి.. ప్ర‌జ‌ల‌ను శాంతింప చేయ‌డంతో పాటు.. ప్ర‌తిప‌క్షానికి బ‌ల‌మైన కౌంట‌ర్ ఇచ్చేదిశ‌గా సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు.

ఏయే రంగాల్లో ఎంతెంత అప్పులు తెచ్చారు? ఏయే సంస్థ‌ల‌ను తాక‌ట్టు పెట్టారు? కేంద్రం నుంచి తెచ్చిన నిధుల‌ను ఎలా దారిమ‌ళ్లించారు? అనే విష‌యాల‌పై స‌ర్కారు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌నున్నారు. అదే సమ‌యంలో ప్ర‌భుత్వం ముందున్న స‌వాళ్ల‌ను కూడా వివ‌రించ‌నుంది. ఒక‌వైపు వాటిని ప‌రిష్క‌రించుకుంటూ వ్య‌వ‌స్థ‌ల‌ను చ‌క్క‌దిద్దుకుంటూ ముందుకు సాగుతున్న వైనాన్ని టీడీపీ నాయ‌కులు ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. సో.. వైసీపీ వ్యూహానికి ప్ర‌తివ్యూహంగానే స‌భ‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. స‌భ‌లో అన‌ర్గళంగా మాట్లాడే నాయ‌కులు.. స‌బ్జెక్టుపై అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుల‌ను ఎంపిక చేసి.. వారికి ఎక్కువ స‌మ‌యం ద‌క్కేలా.. వైసీపీ పాల‌న‌ను ఎండ‌గ‌ట్టేలా.. వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. “ఈసారి స‌భ‌లో వినూత్న‌త ఖాయం. మీరే చూస్తారు. మాట‌లు కాదు.. ప‌క్కా లెక్క‌ల‌తోనే స‌భ‌ను నిర్వ‌హిస్తున్నాం” అని టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఒక‌రు చెప్పారు.