ముచ్చటగా మూడోసారి మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు తొలి పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈ సమావేశాలను బడ్జెట్‌కే పరిమితం చేయాలని అధికార పక్షం చూస్తున్నా.. ప్రతిపక్షాలు మాత్రం ‘అంతకుమించి’ అన్నట్టుగా దూకుడుగా ఉన్నాయి. గత రెండు టెర్మ్‌లలో ప్రతిపక్షాలు వీక్‌గా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకున్న దరిమిలా.. తొలి సభలోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాహుల్‌గాంధీ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.
ముల్లును ముల్లుతోనే తీసినట్టుగా.. మోడీ హిందూత్వ వాదాన్ని అందే హిందూత్వ వాదంతో పార్లమెంటులో తిప్పకొట్టారు. నేరుగా మహాశివుడి ఫొటోను పార్లమెంటుకు తీసుకువచ్చి… హిందూత్వ వాదంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూత్వం అంటే ధ్వేషం కాదని.. ప్రేమ అని రాహుల్ చేసిన ప్రసంగానికి దేశవ్యాప్తంగా మంచి మార్కులు పడ్డాయి. దీంతో బీజేపీ సైతం ఉలిక్కి పడింది. నిజానికి అప్పటి వరకు రాహుల్ అంటే ‘పప్పు’ అని ప్రచారం చేసిన కమల నాథులు ఆయన చేసిన ప్రసంగంపై వివరణ ఇచ్చుకునే పరిస్తితి వచ్చింది. ఇక, ఇప్పుడు కూడా రాహుల్ అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నారు.
నీట్ పరీక్షలో అవకతవకలు సహా.. తాజాగా వెలుగు చూసిన యూపీఎస్సీ అవకతవకల వరకు.. అదేవిధంగా రైలు ప్రమాదాలు, అసోంలో వరదలు, ఆర్థిక సర్వే, ఉగ్రవాదం.. ఇలా అనేక అంశాలపై ప్రతిపక్షాలు సరంజామా సిద్ధం చేసుకున్నాయి. గతంలో మాదిరిగా భారీ మెజారిటీ లేకపోవడంతో మోడీ వాటి నుంచి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇదేసమయంలో కొన్ని బిల్లులను కూడా మోడీ సర్కారు తీసుకువస్తోంది. వీటిలో కొన్నింటికి ఆమోదం లభించినా.. మరో కీలకమైన బిల్లుకు మాత్రం ఇబ్బంది ఎదురవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
అదే.. ప్రభుత్వరంగ సంస్థలలో బ్యాంకుల వాటాను 51 శాతంకన్నా తగ్గించడం. తద్వారా ఆయా సంస్థలను ప్రైవేటీకరించేందుకు సర్కారు అవకాశం ఏర్పడుతుంది. ఈ బిల్లు ఇప్పటికే ప్రతిపాదన దశ నుంచి పార్లమెంటుకు చేరేందుకు రెడీ అయింది. అయితే.. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పెద్ద యుద్ధమే జరిగినా ఆశ్చర్యం లేదు. ఇక, బీహార్ రాష్ట్రం 30 వేల కోట్ల సహాయం చేయాలన్న డిమాండ్‌తోపాటు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా ప్రస్తావించనుంది. ఏపీ నుంచి కూడా.. అధికార పక్ష ఎంపీలు.. సహాయంపై పట్టుబట్టనున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ పార్లమెంటు సమావేశాలు.. వాడి వేడిగా జరగడంతోపాటు.. రాష్ట్రాలపై ముఖ్యంగా మిత్ర పక్ష పాలిత రాష్ట్రాలపై మోడీ ప్రేమ ఎంతుందో తెలిసిపోతుందనడంలో సందేహం లేదు.