రాజకీయ విద్వేషాలకు.. వ్యక్తిగత కక్షలకు కూడా నిలయంగా విలసిల్లిన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని అనుకున్నా.. తాజాగా శనివారం ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా.. ప్రశాంతంగా పరిస్థితి సాగిపోయింది. పెద్దారెడ్డి ఎలా అడుగు పెడతాడో చూస్తా అంటూ.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేయడంతో శనివారం పెద్దారెడ్డి రాక నేపథ్యంలో ఏం జరుగు తుందో అని అందరూ టెన్షన్‌కు గురయ్యారు.
అయితే.. ఎక్కడా ఎలాంటి అల్లరికి అవకాశం లేకుండా.. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు. నేరుగా పట్టణ పోలీస్ స్టేషనుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో అల్లర్ల కేసుకు సంబంధించి ఇటీవల పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన.. ష్యూరిటీ పత్రాలను ఆయన పోలీసులకు అందించారు. వాస్తవానికి పోలీసులే వెంటపడి వాటిని తీసుకోవాల్సి ఉంది. కానీ, తీసుకోలేదు.
ఈ విషయంపైనే పెద్దారెడ్డి ప్రశ్నించారు. వాస్తవానికి పెద్దారెడ్డి రాకతో.. అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. కానీ, ఎలాంటి అల్లర్లు జరగలేదు. దీంతో పెద్దారెడ్డి సైలెంట్‌గా వచ్చి.. సైలెంట్‌గా నే వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం మారినప్పటికీ.. పోలీసులకు-వైసీపీ నాయకులకు మధ్య బంధం ఏ రేంజ్‌లో ఉందో ఈ సందర్భంగా తేటతెల్లమైంది. పెద్దారెడ్డి వెంట వచ్చిన వారిని స్థానిక పోలీసులు ఆప్యాయంగా పలకరించడంతోపాటు.. కరచాలనం చేశారు. అంతేకాదు.. పెద్దారెడ్డి వాహనంలో ఓ ఎస్సై వెనుక సీట్లో కూర్చుని వెళ్లారు. ఇదీ.. సంగతి!!