రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. ప్రజలకు అనేక హామీలు గుప్పించిన విషయం తెలిసిందే. అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి.. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.20 వేలు, మహిళలకు రూ.1500 చొప్పున నెలనెలా ఇచ్చే పథకాలను సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రకటించారు. అయితే.. కూటమి సర్కారు ఏర్పడి.. నెల రోజులు దాటిపోయినా.. వాటిని ఏం చేశారని.. ప్రజలకు పథకాలు అందడం లేదని.. జగన్ తాజాగా ప్రశ్నించారు.
జగన్ సంధించిన ఈ ప్రశ్నకు టీడీపీ నేతలు అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి మూడు శుక్రవారాలు(కామన్ గా అనే మాట) కూడా గడవకముందే.. పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కారని టీడీపీ విమర్శలు గుప్పించింది. ఇదేసమయంలో జగన్ హయాంలో ప్రకటించిన సంక్షేమ పథకాల జాబితాను.. ఎప్పటి నుంచి వాటిని జగన్ అమలు చేశారో వివరాలతో సహా వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో టీడీపీ ఇచ్చిన ఈ వివరాలు హల్చల్ చేస్తున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చినది 2019 మే 30న అని టీడీపీ పేర్కొంది. అయితే.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది మాత్రం 2019, అక్టోబర్ నుంచి అని తెలిపింది. అదేవి ధంగా మత్స్యకార భరోసా ఇచ్చింది 2019 నవంబర్ నుంచి అని, అమ్మ ఒడి పథకాన్ని 2020, జనవరి నుం చి అమలు చేశారని తెలిపింది. ఇక, విద్యార్థులకు మేలు కలిగిస్తున్నామని పేర్కొంటూ.. అమలు చేసిన వసతి దీవెన ఇచ్చింది 2020 ఫిబ్రవరి నుంచి అని టీడీపీ వివరించింది. అంటే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీరిగ్గా 10 మాసాలకు ఈ పథకాలను అమలు చేశారని తెలిపింది.
అదేవిధంగా విద్యార్థులకు.. విద్య దీవెన పథకాన్ని 2020, ఏప్రిల్ నుంచి, మహిళలకు(డ్వాక్రా) సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్ నుంచి అని టీడీపీ పేర్కొంది. జగన్ ప్రకటించిన పథకాలను.. ఎన్నికలు పూర్తయి.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారా? ఇప్పుడు ప్రశ్నించడానికి అని టీడీపీ ఎదురు ప్రశ్నించింది. గతాన్ని జగన్ మరిచిపోయినా.. జనాలు మరిచిపోలేదని తెలిపింది. అంతేకాదు.. అమ్మ ఒడిని ఐదు సంవత్సరాలు అమలు చేయాల్సి ఉన్నా.. కేవలం నాలుగేళ్లే ఇచ్చారని ఈ విషయాన్ని కూడా జగన్ గుర్తు చేసుకోవాలని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates