ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అఖండ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ వాస్తవం ఇంకా బోధపడుతున్నట్లు లేదు.
ఇప్పటికీ అధికారం తమదే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కష్ట కాలంలో పార్టీని, క్యాడర్‌ను పట్టించుకోకుండా తనకు అలవాటైన రీతిలో ఆయన కార్యకర్తలకు దూరంగా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తిరిగి పార్టీని బతికించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ, భవిష్యత్ తమదే అనే భరోసా కల్పించాల్సి ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన జగన్.. ఇప్పుడు బెంగళూరు కోటలోనే మకాం వేస్తున్నారని టాక్.
ఏపీలో ఉండకుండా జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారని, ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ భజన చేసిన అప్పటి మంత్రులు కూడా పత్తా లేకుండా పోయారు.
జగన్ ప్రభుత్వంలో అధికారం, హోదాతో అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్న మంత్రులు ఇప్పుడు కనిపించడం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ వంటి వారు మినహా మిగతా నాయకులు బయటకు రావడం లేదు. జగన్ సమావేశాలు పెట్టిన వీళ్లలో చలనం ఉండటం లేదని టాక్.
సొంత వ్యాపారాలను కాపాడుకోవడం కోసం మాజీ మంత్రుల్లో చాలా మంది ఇప్పటికే ఏపీ బార్డర్ దాటేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులకు వీళ్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో అటు జగన్ పట్టించుకోక.. ఇటు మాజీ మంత్రుల జాడ లేక వైసీపీ కేడర్ మరింత ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates