రేవంత్.. ఆచితూచి!

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి త‌న‌దైన పంథాలో సాగిపోతున్నారు. కొన్ని విష‌యాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రికొన్ని విష‌యాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స‌వాళ్ల న‌డుమ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థంగా న‌డిపిస్తున్నారు. ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే రేవంత్ ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.

డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళ‌న చేశారు. కానీ ఈ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కే రేవంత్ మొగ్గు చూపారు. అందుకే మ‌రో డీఎస్సీ వేస్తామ‌ని, ఈ ప‌రీక్ష మాత్రం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. దీంతో కాస్త అసంతృప్తి అదుపులోకి వ‌చ్చింది. తాజాగా గ్రూప్‌-2 ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌డంతో నిరుద్యోగుల్లో ప్ర‌భుత్వంపై ఉన్న ఆగ్ర‌హం పోయింది. వాళ్ల‌ను శాంతింప‌జేసేలా రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక గ‌తంలో కేసీఆర్ హ‌యాంలో రైతుబంధు ప‌థ‌కం కింద వంద‌ల ఎక‌రాలు ఉన్న‌వాళ్లు కూడా ల‌బ్ధి పొందారు. అంత అవ‌స‌రం లేక‌పోయినా రూ.ల‌క్షల్లో ప్ర‌భుత్వ సొమ్ము అందుకున్నారు. అందుకే రేవంత్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రైతుబంధును రైతుభ‌రోసాగా మార్చి అవ‌స‌రాల్లో ఉన్న రైతుల‌కే ల‌బ్ధి చేకూర్చాల‌ని చూస్తున్నారు.

వ్య‌వ‌సాయం చేస్తున్న అన్న‌దాత‌ల‌కు, పెట్టుబ‌డి సాయం కావాల్సిన వాళ్ల‌కే మేలు జ‌రిగేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. దీని కోసం మంత్రుల‌తో క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో రైతుభ‌రోసా ప‌థ‌కం అమ‌లు ఆల‌స్య‌మ‌వుతోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ప్ర‌శ్నిస్తున్నా రేవంత్ మాత్రం త‌న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నారు. ఇక రుణ‌మాఫీ కూడా అక్ర‌మ దారి ప‌ట్ట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.