2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అరాచక పాలనతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యారనే టాక్ ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కనిపించింది. దీంతో 11 సీట్లకు పడిపోయారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్‌కు ధైర్యం చాలడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి వెళ్తే టీడీపీకి టార్గెట్‌గా మారడం ఖాయమని భావించి అసెంబ్లీ డుమ్మా కొట్టేందుకే జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా సరిగ్గా టైమ్‌కు వెళ్లి వచ్చారు. మళ్లీ సభలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ఆరంభం కానున్నాయి. ఇప్పుడు కూడా డుమ్మా కొట్టేందుకు జగన్ మరో వ్యూహం సిద్ధం చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వినుకొండలో రషీద్ హత్యను ఖండించాల్సిందే. ఈ ఘటనను చూపుతూ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను జగన్ కోరడం మాత్రం విడ్డూరమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని, తర్వాతి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ వెళ్తామని జగన్ చెప్పారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ఉండకూడదనే ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రసాభాస చేస్తే జగన్‌ను సభ నుంచి బయటకు పంపించే ఆస్కారముంది. ఆయనకు కూడా ఇదే కావాలనేది టాక్.
మరోవైపు వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదలను అసెంబ్లీలో చేయాలని సీఎం బాబు నిర్ణయించారు. వివిధ శాఖల్లోని అవినీతిని బయటపెట్టాలన్నది బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో సభలో జగన్‌కు ఇబ్బందులు తప్పవు. సభలో కౌంటర్లను తట్టుకోని నిలబడటం జగన్‌కు సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. దీంతో సభకు డుమ్మా కొట్టడం తప్పా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే వినుకొండ ఘటనను అడ్డం పెట్టుకుని, అసెంబ్లీకి దూరంగా ఉండాలన్ని జగన్ ఆలోచనగా తెలుస్తోందనే అభిప్రాయాలున్నాయి.