ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ రాజకీయ మిత్రులనే విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఇరువురు నాయకులు కూడా ఎవరినీ లెక్క చేయలేదు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా అధికారం కోల్పోయారు. ఇక, ఇద్దరిలోనూ కామన్‌గా ఉన్న ఇష్యూ.. తాము అధికారంలో ఉండి.. తాము ఏం చేసినా.. చెల్లుతుందనే టైపు. అధికారం కోల్పోయాక.. ఏం జరిగినా.. అప్పుడు ప్రజాస్వామ్యం, విలువలు, వలువలు అంటూ వ్యాఖ్యలు చేస్తారు. తమ వారిని రోడ్డెక్కిస్తారు.
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ఇప్పుడు జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అందరూ ఖండించాల్సిందే. ఖండిస్తున్నారు కూడా. కానీ, ఈ విషయంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. రాష్ట్రంలో ఈ ఘటనలు ఇప్పుడే కొత్తన్నట్టుగా.. గతంలో ఎప్పుడూ ఏమీ జరగనట్టుగానే ఉన్నాయి. గత ఐదేళ్లలో శాంతి భద్రతలు భేష్‌గా ఉన్నాయన్న భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవాల జోలికి వెళ్తే.. డాక్టర్ సుధాకర్ హత్య నుంచి డెడ్‌బాడీ డోర్ డెలివరీ వరకు.. పల్నాడులో కక్ష పూరిత రాజకీయాల నుంచి పుంగనూరులో దారుణాల వరకు ఎవరూ మరిచిపోలేదు.
అయినప్పటికీ.. జగన్ మాత్రం.. ఇప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోందని.. ప్రభుత్వం శాంతి భద్రతల ను గాలికి వదిలేసిందని చెప్పుకొంటున్నారు. ఇక, కేసీఆర్ విషయానికి వస్తే.. ఈయన కూడా తక్కువేమీ కాదు. రాజకీయాలను తన చేతుల్లో పెట్టుకునేందుకు పార్టీలకు మనుగడే లేకుండా చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు.. సబితా ఇంద్రారెడ్డి వంటివారికి పదవులు ఇచ్చినప్పుడు.. ఆయనకు ప్రజాస్వామ్యం.. పార్లమెంటరీ వ్యవస్థ వంటివి ఎక్కడా మచ్చుకు కూడా కనిపించలేదు.
ఇదే పని పొరుగు పార్టీ చేస్తే.. కేసీఆర్‌కు చిర్రెత్తుకొస్తోంది. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోంది. పార్లమెంట రీ చట్టాలు చట్టుబండలైపోతున్నాయి. ఇతమిత్థంగా కేసీఆర్ చెప్పేది ఇదే. వారు మాత్రమే వాటిని చేయా లని.. ఇతరులు ఎవరూ చేయరాదన్న విధంగా అటు జగన్ కానీ.. ఇటు కేసీఆర్ కానీ వ్యవహరించారు. సాధారణంగా ఒక ఓటమి అనేక పాఠాలు నేర్పుతుంది. కానీ, ఒక ఓటమి వీరికి ఎలాంటి పాఠాలూ నేర్పడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సో.. మున్ముందు మరిన్ని ఓటములకు వారు సిద్ధపడతా రేమో.. చూడాలని అంటున్నారు.