పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వినుకొండలో పర్యటించారు. బాధితుడు రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం పనిచేశాడన్న కారణంతోనే రషీద్ ను దారుణంగా హత్య చేశారని, కానీ, పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలని చెబుతున్నారని జగన్ మండిపడ్డారు.
పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేపై కూడా దాడి జరిగిందని, దాడి చేయడమే కాకుండా వాళ్లపై మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచక పాలనపై ప్రధాని మోడీతో పాటు అందరినీ కలుస్తానని జగన్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యా రాజకీయాల గురించి ప్రధాని మోడీకి వివరిస్తానని జగన్ చెప్పారు. ఇక, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తానని జగన్ అన్నారు.
అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో బుధవారం నాడు ధర్నా చేస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకం రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates