బీఆర్ఎస్‌కు ఏం కలిసి రావడం లేదు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న ఆ పార్టీ అప్పటి నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు, ఎమ్మెల్యేల పార్టీ జంపింగ్‌లతో బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలని కేటీఆర్, హరీష్ రావు కాస్త ప్రయత్నిస్తున్నా సీఎం రేవంత్ వాళ్లకు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ పసలేని కామెంట్లు, విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్‌ను టార్గెట్ చేయాలని కేటీఆర్, హరీష్ ప్రయత్నిస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదనే చెప్పాలి. ఒక పాయింట్ మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వీళ్లు సిద్ధం కాగానే రేవంత్ కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ల విమర్శలకు పథకాల అమలుతోనే సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు ప్రజల్లోకి వెళ్లేముందే రేవంత్ హామీలు అమలు చేస్తూ సాగుతున్నారు. తాజాగా రుణమాఫీ కూడా మొదలు పెట్టడం ఇందుకు నిదర్శనమని చెప్పాలి.
ఆగస్టు 15లోపు కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ పదేపదే చెప్పారు. కానీ అది సాధ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై గొంతు చించుకున్నారు. ఇప్పుడు వాళ్లందరి నోళ్లు మూయించేలా రుణమాఫీ ప్రక్రియను రేవంత్ సర్కారు మొదలెట్టింది. ఆగష్టు 15 లోపే రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయనుంది. ఇది బీఆర్ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బలా తగిలింది. ఇక ఇందులోనూ రేషన్ కార్డు నిబంధన గురించి బీఆర్ఎస్ మాట్లాడింది. ఇప్పుడు అది కంపల్సరీ కాదని ప్రభుత్వం చెప్పడంతో బీఆర్ఎస్ సైలెంట్ గాక తప్పలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బీఆర్ఎస్ పడిపోయింది. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రష్టేషన్‌లో కేటీఆర్, హరీష్ ఏదో మాట్లాడుతున్నారని, వాళ్ల కామెంట్లకు విలువ ఉండటం లేదనే టాక్ వినిపిస్తోంది.