పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రషీద్ ను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జిలాని అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి చేయి నరికిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, జిలాని టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అని టిడిపి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు వినుకొండలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని అన్నారు. అయితే, జగన్ వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చని చెప్పారు. కానీ, జన సమీకరణ చేయవద్దని, ఎక్కువమంది గుమిగూడి ప్రదర్శనలు వంటివి చేయకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, జగన్ వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వారి కార్లను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో పాటు వినుకొండ వెళ్లే మార్గమధ్యలో ఆపివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించి వేరే వాహనం ఇచ్చారని, అది బాగోలేకపోవడంతో జగన్ సొంత వాహనంలో వెళుతున్నారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates