వైసీపీలో కీలకంగా వ్యవహరించి.. పార్టీ గెలుపు కోసం.. పంతాలకు కూడా పోయిన నాయకుడు ఒకవైపు. సంక్రాంతి పేరుతో రోడ్లపై డ్యాన్సులు వేస్తూ.. నోటికి వచ్చింది మాట్లాడే మాజీ మంత్రి మరోవైపు. వీరిద్దరూ కలుసుకున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో కలుసుకున్నట్టు సమాచారం.
వారే.. ఒకరు ముద్రగడ పద్మనాభం. మరొకరు అంబటి రాంబాబు. ఏంటి స్పెషల్ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటీవల ముద్రగడ రాజకీయ శపథం చేసి.. జనసేన అధినేత పవన్ గెలిస్తే.. పేరు మార్చుకుంటానని చెప్పారు. అన్నట్టుగానే పేరులో రెడ్డి చేర్చుకుని నేమ్ మార్చుకున్నారు.
ఆ తర్వాత.. ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేక పోతున్నారు.ముఖ్యంగా కాపు సమాజంలోనూ ఆయన ఒంటరియ్యారు. ఇంకో వైపు.. కుమార్తె కూడా మరింత దూరంగా ఉండడంతోపాటు.. రాజకీయంగా పదునైన వ్యాఖ్యలతో ముద్రగడను ఇరుకున పెడుతున్నారు. ఈ పరిణామాలతో పద్మనాభం ఒకింత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి సమయంలో పార్టీ నుంచి సాంత్వన లభిస్తుందని ఆయన వేచి చూసినా.. వైసీపీ అధినేత జగనే.. తనను ఓదార్చేవారు లేక పులివెందుల-బెంగళూరు అంటూ.. పర్యటనలు పెట్టుకుని చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి సమయంలో సంబరాల రాంబాబు ఆయనను కలుసుకున్నారు.
ఇద్దరూ ఒకరి గోడు మరొకరితో వెళ్లబోసు కోవడం మినహా లభించింది ఏమీ లేదు. అయితే.. మరోవైపు వైసీపీకీ వీరిద్దరి కలయిక తో మరింత డ్యామేజీ ఏర్పడిందని అంటున్నారు. ముద్రగడకు ఇంకా కాపుల్లో అంతో ఇంతో ఇమేజ్ ఉంది.
ఆయన బాధలో ఉన్నారని తెలిసి.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు కలుస్తూనే ఉన్నారు . ఓ దారుస్తూనే ఉన్నా రు. సహజంగా ఇలాంటి సమయంలో పార్టీ అధినేత స్పందిస్తారని అందరూ ఆశించారు. ముద్రగడను పిలిపించుకునో.. లేక తనే వచ్చో.. ఒకింత ఓదారుస్తారని.. పార్టీలో అయినా.. ప్రాధాన్యం ఇస్తారని కాపులు ఎదురు చూశారు.
కానీ జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటితే.. పులివెందుల.. లేకపోతే, బెంగళూరుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో రాంబాబును పంపించనట్టు తెలవడంతో ముద్రగడకు వైసీపీ ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చ రాజకీయంగా కాపుల్లో ప్రారంభమైంది. నిజానికి వైసీపీ లో ఉన్న నాయకుల్లో ముద్రగడను తీసిపారేసే నాయకుడు అనలేం.
ఆయన ఓడినా గెలిచినా.. కొన్ని విలువలు పాటిస్తున్నారు. అలాంటి నాయకుడికి అధికారంలో ఉన్నప్పుడూ… విలువ ఇవ్వలేదని.. ఇప్పుడు ఓడిన తర్వాత బాధలో ఉన్నా కూడా.. పట్టించుకోవడం లేదని కాపుల్లో చర్చ ప్రారంభమైంది. ఇది మున్ముందు వైసీపీకి మరింత డ్యామేజీ జరగడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.