సీన్లోకి దిగిన భారతీయ అమెరికన్లు.. రాత్రికి రాత్రి రూ.25కోట్లు

మన దేశంలో ఎన్నికలతో పోలిస్తే.. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల తీరు మొత్తం భిన్నంగా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం కీలకమని చెప్పక తప్పదు. ఇప్పటికి వెలువడుతున్న అంచనాల ప్రకారం డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ జోరు మీద ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సర్వేల్లో వెనుకపడినట్లుగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జో బైడెన్ కోసం భారతీయ అమెరికన్లు రంగంలోకి దిగారు.

ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఒక్క రాత్రిలోనే రూ.24.34 కోట్ల మొత్తాన్ని విరాళంగా సేకరించారు. దగ్గర దగ్గర రూ.25 కోట్ల మొత్తాన్ని ఒక్క రాత్రిలో ఫండ్ రైజ్ చేసిన తీరు ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఫండ్ రైజింగ్ రికార్డులు బద్ధలైనట్లుగా చెబుతున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవిలో ఉండటంతో ఇంత భారీగా నిధులు వచ్చినట్లుగా భావిస్తున్నారు.

జో బైడెన్ కోసం భారీగా నిధులు సేకరించిన భారతీయ అమెరికన్లు.. ఆయన్ను కొన్ని ప్రశ్నల్ని సంధించారు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో తమకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసేందుకు వెనుకాడలేదు. జో విజన్ లో అన్ని మతాల వారికి సెక్షన్లు పెట్టారని.. హిందువులకు మాత్రం సెక్షన్ ఏర్పాటు చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు.

జో బైడెన్ ముస్లిం సెక్షన్ లో కశ్మీర్ ప్రజల హక్కుల పునరుద్దరణకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి.. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపైనా భారతీయ అమెరికన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యల్ని జో బెడైన్ పున:సమీక్షించుకోవాలని కోరటం గమనార్హం.