తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోయిన వారు పోగా.. బీఆర్ ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. తప్పకుండా రావాలని.. స్పీకర్‌ను కలుస్తున్నామని.. ఫోన్లు చేసి మరీ చెప్పారు. అయితే.. అందరూ అధినేత మాటకు ఓకేచెప్పారు. తీరా సమయం వచ్చే సరికి 12 మంది డుమ్మా కొట్టారు. దీంతో 15 మంది మాత్రమే వెళ్లి స్పీకర్‌ను కలుసుకుని.. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలని విన్నవించారు. వీరంతా గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. డుమ్మా కొట్టిన నాయకులు పార్టీలో ఉంటారా? పార్టీని వదులుకుంటారా? అనేది చూడాలి.
డుమ్మా కొట్టింది.. ఎవరెవరు?
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
- మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(ఈయన పార్టీ మారుతారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది)
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
- సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(ఇటీవల కాలంలో పార్టీ మార్పుపై చర్చ సాగుతోంది)
- సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ
- బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (పార్టీ మారకపోవచ్చు అనే సంకేతాలు ఉన్నాయి)
- జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి