చంద్రబాబు అంటే.. క్రమశిక్షణకు, సమయ పాలనకు ప్రతిరూపం. ఈ విషయంలో తేడా లేదు. ఆయనను విమర్శించే వారు కూడా.. ఆయన క్రమశిక్షణను మెచ్చుకుంటారు. ఆయన సమయ పాలనను, ఖచ్చితత్వాన్ని సైతం వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అయితే.. చంద్రబాబు తానొక్కడినే కాదు.. తన మంత్రి వర్గం కూడా.. అలానే ఉండాలని తపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆయా విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. మంత్రులు క్రమశిక్షణ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఇదీ.. మంత్రులకు చంద్రబాబు బోధ…
- మంత్రులుగా ఉన్నవారు ఎవరి శాఖలు వాళ్లే చూసుకోవాలి. ఎంత ఉత్సాహం ఉన్నా.. ఇతరులకు కేటాయించిన శాఖల్లో వేలు పెట్టడానికి వీల్లేదు. అలా చేస్తే.. ఇబ్బందులు వస్తాయి. ఇది వివాదాలకు, మనస్ఫర్థలకు కూడా దారి తీస్తుంది.
- నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి. శాఖల అధిపతులతో అనుబంధం పెంచుకోవాలి. వారానికి నాలుగు రోజులు సచివాలయాలకు వచ్చి.. శాఖాధిపతులకు, ఇతర అధికారులకు అందుబాటులో ఉండాలి. సమయ పాలన పాటించాలి. తద్వారా ఉద్యోగులు కూడా సమయానికి ఆఫీసులకు వచ్చేలా చేయాలి.
- గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఉండాలి. గతంలో మాదిరిగా.. వ్యవహరించడానికి లేదు. అలా చేస్తే.. ప్రజలు అన్నీ గమనిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులు దూకుడు తగ్గించుకుని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- కళ్లు నెత్తికెక్కితే చర్యలు తప్పవు. ఉచిత ఇసుక విషయంలో ఎవరూ కలుగచేసుకోవద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలి.
- మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలి. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్థాయిలో ఉండాలి. ప్రతి నెలా తమ శాఖలపై రివ్యూ చేసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
- సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు. సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. టెక్నాలజీని విరివిగా వినియోగించుకుని తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలి.