జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఒక నిశ్చలం-ఒక నిర్భయం
అన్న సూత్రంతో ముందుకు సాగుతున్నారు. తను తీసుకునే నిర్ణయాలను నిర్భయంగా ఆయన వెల్లడిస్తున్నారు. అదేవి ధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య పోరు జరుగుతున్నప్పటికీ చాలా నిశ్చలంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ పునాదులను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ఒక పార్టీ అభివృద్ధి చెంది, అధికారాన్ని పంచుకునే స్థాయిలోకి వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు, వర్గ పోరు, పదవులు ఆశించే వారు పెరగడం వంటివి కామన్ గా జరుగుతుంది. జనసేనలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు నాయకులు పదవుల కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాగించుకుంటున్నారు. అదేవిధంగా విజయవాడలోనూ ఒక కీలక నాయకుడు ఎన్నికల సమయంలో తాను భారీగా ఖర్చు పెట్టానని, జిల్లా వ్యాప్తంగా తిరగానని, తనను గాలికి వదిలేసారని వ్యాఖ్యలు చేస్తూ పార్టీ అధినేతకు వినతిపత్రం సమర్పించారు.
ఇలా చాలా జిల్లాలలో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా ఆవేశపడకుండా చాలా ఆలోచించి ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా పదవుల పంపకాలు, కూటమి పార్టీలతో అనుసరిస్తు న్న తీరు కూటమి పార్టీల ద్వారా వస్తున్న నామినేటెడ్ పదవులను ఇచ్చే విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీని వల్ల కొందరు నాయకులు హర్ట్ అవుతున్నారన్న విషయం తెలిసిందే. నిజానికి పార్టీ స్థాపన నుంచి జనసేనతో కలిసి మమేకమైన వారు చాలామంది ఉన్నారు.
కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకుని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు నామినేటెడ్ పదవి విషయంలో అయినా తమకు న్యాయం చేయాలి అనేది వీరి డిమాండ్. కానీ పవన్ మాత్రం ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, వాటికి అనుగుణంగా మాత్రమే తన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పడం ద్వారా ఒక ఒక నిర్భయమైన వాతావరణంలో తాను రాజకీయాలు చేస్తున్నారనే సంకేతాలను పంపించారు.
అదేవిధంగా రాజకీయ వారసత్వాన్ని తాను ప్రోత్సహించేది లేదని చెప్పడం ద్వారా నిశ్చలమైన రాజకీయాలను చేస్తానని సంకేతాలను కూడా ఆయన సమాజంలోకి పంపించగలిగారు. ఇది భవిష్యత్తు రాజకీయ పరిణామాలను జనసేనకు అనుకూలంగా మారుస్తుందనే విషయం స్పష్టంగా చెబుతోంది. కానీ, పార్టీల్లో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏ మేరకు సరితూగ గలుగుతుందనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే.. నాయకులు ఎవరైనా అవసరం-అవకాశం అనే రెండు పట్టాలనే నమ్ముకుంటారు.. తప్ప.. సిద్ధాంతాలను కాదు .. కదా!