ఒకప్పుడు ఆయన మాట అంటే శాసనం. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన మాటకు ఎదురే లేదు. వరుసగా రెండు సార్లు సీఎం పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారనే చెప్పాలి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెబుతారన్నది కాదనలేని నిజం. ఎన్నికల్లో ఓటమితో ఆ నాయకుడి పవర్ పోయింది. మాటలు వినేవాళ్లే లేరు. ఆ నేత ఎవరో కాదు కేసీఆర్. అవును.. ఇప్పుడు కేసీఆర్ మాటను వినేవాళ్లెవరు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మునిగిపోయే కారులో ఉండటం కంటే అధికారంలో ఉన్న చేయిని అందుకోవడం మేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వరుస కట్టారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. మరికొంత మంది లైన్లో ఉన్నారు. పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
అయినా కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఫామ్‌హౌజ్‌లో రెస్టు తీసుకుంటున్నారు. ఇటీవల ఒకసారి ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం పెట్టి పార్టీలోనే ఉండాలని చెప్పారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. కానీ ఆయన మాటలను పట్టించుకోని నాయకులు నమ్మకం లేదు దొరా అంటూ రేవంత్‌కు జై కొడుతున్నారు.
ఒకప్పుడు కేసీఆర్ మాటను జవదాటని నాయకులు ఇప్పుడు లెక్క చేయడం లేదు. కేసీఆర్ వైఖరి కారణంగానే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసీఆర్ మాటకు ఇప్పుడు విలువ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కేసీఆర్ కూడా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సైలెంట్‌గా ఉండిపోతున్నారని అంటున్నారు. పార్టీ మారొద్దని చెప్పగలరు కానీ బలవంతంగా ఎవరినీ ఆపలేరు కదా. కేసీఆర్ వరస చూస్తుంటే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.