షాకింగ్‌: ట్రంప్‌పై హ‌త్యాయ‌త్నం.. తృటిలో త‌ప్పిన ముప్పు

అగ్రరాజ్యం అమెరికాలో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఆయ‌న పాల్గొన్న ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌లో దుండ‌గుడు అతి సమీపం నుంచి కాల్ప‌లు జ‌రిపాడు. డొనాల్డ్ ట్రంప్‌ను ల‌క్ష్యంగా చేసుకుని జ‌రిపిన ఈ కాల్పుల్లో అదృష్ట‌వశాత్తు ట్రంప్ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. అయితే.. ట్రంప్ కుడి చెవికి తీవ్ర గాయ‌మై ర‌క్త‌స్రావం జ‌రిగింది. ఈ ఏడాది న‌వంబ‌రు 5న అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున అధ్య‌క్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌.. దేశ‌వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పెన్సిల్వేనియాలోని బట్ల‌ర్ ప్రాంతంలో రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కులు నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా ఓ దుండ‌గుడు తుపాకీతో కాల్ప‌లకు తెగ‌బ‌డ్డాడు. డొనాల్డ్ ట్రంప్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జ‌రిపాడు. దీంతో ట్రంప్ ఒక్క‌సారిగా వేదిక‌పై కుప్పకూలారు.

భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్‌ చుట్టూ రక్షణగా చేరారు. అనంత‌రం.. ట్రంప్‌ను వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్ప‌ల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయ‌మైంది. ట్రంప్‌ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే.. ఈ కాల్పుల వెనుక త‌న ప్ర‌త్య‌ర్థులు ఉన్నారంటూ.. ట్రంప్ వ్యాఖ్యానించారు. వేదిక‌పై నుంచి దిగి.. ఆసుప‌త్రికి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న పిడికిలి బిగించి.. నినాదాలు చేశారు.

కాగా, త‌న ప్ర‌త్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జ‌రిగిన కాల్పుల దాడిని అమెరికా అధ్యక్షుడు, డెమొక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థి జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. అమెరికాలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. దీనివెనుక ఎవ‌రు ఉన్నా.. వ‌దిలి పెట్ట‌బోమ‌ని బైడెన్ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. క‌మ‌లా హ్యారిస్ స‌హా.. ప‌లువురు ముఖ్య నాయ‌కులు కూడా.. ఈ కాల్పుల‌ను తీవ్రంగా ఖండించారు.