తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ నుంచి దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఖాళీ అవుతున్నా రు. ఇప్పటికే పది మంది బయటకు వచ్చేయగా.. వారిని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో వారిని పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఐదుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, ఎమ్మెల్సీలు కూడా.. క్యూ కట్టిన విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు తాజాగా శేరిలింగంపల్లి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కండువా మార్చేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో వచ్చిన గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గాంధీ సహా ఆయన అనుచరులకు రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీతో పాటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ ఎస్ కార్పొరేటర్లు, గాంధీ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ మారిన వారిలో కీలకమైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇదిలావుంటే, అరికపూడి గాంధీ చేరిక వ్యవహారం గత వారం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.