జగన్‌‌ను మెప్పించి.. గట్టిగా ఇరుక్కున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా 151 సీట్లతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతోొ ఇక వైసీపీకి తిరుగులేదని.. టీడీపీ, జనసేన ఇక లేవలేవని.. ఇంకోసారి కూడా జగన్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధీమా ఆ పార్టీ వర్గాల్లోనే కాక జగన్ అండ్ కోకు మద్దతుగా నిలిచే అధికారుల్లోనూ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే అధికారులు జగన్ సర్కారుకు తొత్తుల్లా మారిపోయి హద్దులు దాటి ప్రవర్తించారని.. జగన్ రాజకీయ ప్రత్యర్థులను అదేపనిగా వేధించారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇలా తీవ్ర వివాదాస్పదంగా మారిన అధికారుల్లో అప్పటి సీబీసీఐడి చీఫ్‌గా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ ఒకరు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి రెబల్‌గా మారి.. జగన్‌ను టార్గెట్ చేసుకున్న రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.

తనను లాఠీ దెబ్బలు కొట్టడంతో పాటు తనకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసి కూడా గుండెల మీద కూర్చున్నట్లుగా రఘురామ అప్పట్లో జడ్జి ముందు వాంగ్మూలం ఇవ్వడం తెలిసిందే. అంతే కాక తనను హింసిస్తూ జగన్‌కు వీడియో కాల్ చేసి చూపించినట్లు కూడా ఆయన ఆరోపించడం గుర్తుండే ఉంటుంది. మూడేళ్ల కిందటి ఈ కేసు మీద ఇప్పుడు రఘురామ గట్టిగా కూర్చున్నారు.

జగన్‌తో పాటు పీవీ సునీల్ కుమార్, ఒకప్పటి ఇంటలిజెన్స్ విభాగాధిపతి సీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఆయన హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా తెరిచారు గుంటూరు పోలీసులు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇరుక్కోబోయేది సునీల్ కుమారే అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జగన్‌కు కూడా ఈ కేసు ఇబ్బందే అయినా.. తనను ప్రత్యక్షంగా హింసించిన సునీల్‌ను రఘురామ వదలబోరని, చట్టప్రకారం ఆయనపై చర్యలుండేలా గట్టిగా బిగించబోతున్నారని అంటున్నారు. కాగా.. హైకోర్టు తిరస్కరించిన కేసులో మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారంటూ ట్విట్టర్ వేదికగా సునీల్ ప్రశ్నించారు.

కానీ ఈ కేసును హైకోర్టు తిరస్కరించలేదన్నది నిపుణులు చెబుతున్న మాట. జగన్‌ను మెప్పించడం కోసం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా సునీల్ వ్యవహరించినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతున్నారని.. ఇది సివిల్ సర్వెంట్లకు ఒక పాఠంగా మారడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.