ఢిల్లీలో మొద‌లెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ కు కష్టకాలం

ఎటు చూసినా బీఆర్ఎస్‌కు స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. స‌వాళ్ల సుడిగుండంలో ఆ పార్టీ చిక్కుకుంది. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ శాస‌న‌స‌భ ప‌క్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా రేవంత్ సాగుతున్నారు.

ఇక అటు ఢిల్లీలో ఏమో బీఆర్ఎస్‌ను దెబ్బ‌కొట్టేందుకు బీజేపీ సిద్ధ‌మైంద‌ని తెలిసింది. బీఆర్ఎస్ రాజ్య‌స‌భ ఎంపీల‌ను పార్టీలో చేర్చుకునేందుకు క‌స‌ర‌త్తు మొద‌లెట్టింద‌ని టాక్‌. బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ బీజేపీలో విలీనం అవడం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఒక్క లోక్‌స‌భ స్థానంలోనూ గెల‌వ‌క‌పోవ‌డంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాల‌ని రాజ్య‌స‌భ ఎంపీలు భావిస్తున్న‌ట్లు తెలిసింది. బీఆర్ఎస్‌కు భ‌విష్య‌త్ లేద‌ని ఈ ఎంపీలు బీజేపీతో ట‌చ్‌లోకి వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్‌కు ప్రాతినిథ్యం లేదు. రాజ్య‌స‌భ‌లో పార్థ‌సార‌థి రెడ్డి, దామోద‌ర్ రావు, సురేశ్ రెడ్డి, వ‌ద్ధిరాజు ర‌విచంద్ర బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్నారు.

ఈ న‌లుగురు బీఆర్ఎస్ రాజ్య‌స‌భ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని తెలిసింది. అదే జ‌రిగితే బీజేపీలో బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ విలీనం త‌ప్ప‌దు. మ‌రోవైపు ఈ ఎంపీల‌తో కాంగ్రెస్ కూడా ట‌చ్‌లోకి వ‌చ్చింద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి షాక్ త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.