తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే మరికొంతమంది కూడా కారు దిగి హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ సవాలు విసిరిన కేసీఆర్, కేటీఆర్‌కు దిమ్మతిరిగేలా రేవంత్ చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాకతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ దీన్ని మొగ్గ దశలోనే తుంచేస్తూ రేవంత్ అసంతృప్తి బయట పడకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కూడా బలం ఉంది. గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిన నియోజకవర్గాలూ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
ఉదాహరణకు చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీంభరత్ కేవలం 282 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంపై పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ ఆయన ఎక్కడా బహిరంగంగా దీనిపై మాట్లాడలేదు. అందుకు కారణం రేవంత్. భరత్‌తో వ్యక్తిగతంగా రేవంత్ మాట్లాడి సర్దిచెప్పారని సమాచారం.
ఇలాగే ఇతర నియోజకవర్గాల కాంగ్రెస్ నేతల్లోని అసంతృప్తిని రేవంత్ ఎక్కడికక్కడే తగ్గిస్తూ వస్తున్నారు. అయిదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే చేరికలు తప్పదని కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా చెబుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి తమకు అన్యాయం చేస్తారనే అనుమానాలు అవసరం లేదని నచ్చచెబుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తానని ఆ అసంతృప్తిని రేవంత్ పెరగకుండా ఆపేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.