ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల భయం వెంటాడుతోంది.
మరోవైపు పార్టీని వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆయన త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని సమాచారం.
వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పార్టీని వీడారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకున్నారు. నటుడు అలీ సైతం పొలిటికల్ కెరీర్ వద్దనుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం కూడా జగన్‌కు బైబై అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బలరాం టీడీపీ తరపున చీరాల నుంచి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బలరాం రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే వైసీపీలో ఉంటే లాభం లేదని ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలిసింది.
తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ పార్టీ ఓడిపోయిందని టీడీపీని వదలి వెళ్లిన బలరాంను బాబు తిరిగి చేర్చుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.