షర్మిల గాలానికి వైసీపీ నేతలు చిక్కుతారా ?!

అన్న మీద తిరుగుబాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఓటమికి తీవ్రంగా కృషిచేసిన వైఎస్ జగన్ సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. అయితే ఎన్నికల్లో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆమె దూకుడుగా వెళ్తుండడం గమనార్హం.

వైఎస్ జయంతి వేదికగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను తీసుకువచ్చి మంగళగిరిలో ఘనంగా నిర్వహించిన షర్మిల వైఎస్ వారసురాలిని తానేనని ప్రకటించుకున్నది. ఏపీలో వైసీపీ ప్రస్తుతం 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను కాంగ్రెస్ వైపు లాక్కోవాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది.

జగన్ బలహీనపడడం, వైసీపీ కనుమరుగు కావడం టీడీపీ కూడా ఆశిస్తుంది. అయితే ఇన్నాళ్లూ వైసీపీలో ఉండి అడ్డగోలు వ్యవహారాలు చేసిన నేతలను టీడీపీలో చేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరినా టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేకపోగా, వైసీపీ బలహీనం కావాలన్న టీడీపీ లక్ష్యం నెరవేరుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో షర్మిలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కడపకు, పులివెందులకు వచ్చి షర్మిల గెలుపు కోసం పనిచేస్తానని, షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తామని వైఎస్ జయంతి వేడుకల్లో రేవంత్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ ల సహకారంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది.

గత ఎన్నికలలో వైసీపీ టికెట్ నిరాకరించిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న వారిని కాంగ్రెస్ వైపు లాక్కు రావాలని షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. మరి షర్మిల గాలానికి చిక్కే వారెవరో తెలియాలంటే వేచిచూడాల్సిందే.