బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. తెలంగాణలో పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో అవమానమే మిగిలింది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. ఈ పరిస్థితిల్లో బీజేపీతో జతకడితేనే బీఆర్ఎస్ బతికే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. కానీ పార్టీ అధినేత చేసిన తప్పు కారణంగా బీఆర్ఎస్‌తో పొత్తుకు బీజేపీ ససేమీరా అంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అహంకారానికి పోయిన కేసీఆర్ కారణంగా బీఆర్ఎస్ మరింత మునుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎదురులేదని కేసీఆర్ అనుకున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలవడంతో అధికార గర్వంతో ఎగిరెగిరి పడ్డారు. అదే అధికారంతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ టచ్ చేశారు. ఆయన్ని అరెస్టు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆయన కోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ఉన్నారు. బీజేపీలో, ఆర్ఎస్ఎస్‌లో బీఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి. తమ ఎమ్మెల్యేలను కొనడంలో ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర అని కేసీఆర్ మొత్తుకున్నారు. దీంతో బీజేపీకి మండింది.
ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఆగమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఏమో జైల్లో ఉంది. పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్ని రకాలుగా కలిసొస్తుందని కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని టాక్. ఢిల్లీ వెళ్లి మరీ ఈ మేరకు బీజేపీ నేతలతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నించారని తెలిసింది. అయితే బీఆర్ఎస్‌తో పొత్తుకు బీఎల్ సంతోష్ నో చెప్పారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. కష్టపడితే తెలంగాణలో పుంజుకునే అవకాశం బీజేపీకి ఉంది. అందుకే బీఆర్ఎస్ తమకు అవసరం లేదని సంతోష్ తేల్చి చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సంతోష్‌ను కాదని దక్షిణాదిలో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని టాక్. అందుకే ఆనాడు కేసీఆర్ చేసిన తప్పు ఇప్పుడు బీఆర్ఎస్‌కు శాపంగా మారందని అంటున్నారు.