చేతిలో అంతులేని అధికారం ఉన్న వేళ.. దాన్ని జాగ్రత్తగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సొంత అవసరాల కోసం వాడేస్తే.. ఆ తర్వాత ఏదో రోజు అదో తలనొప్పిగా మారటంఖాయం. ఇప్పుడు ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి విషయంలో అలాంటిదే చోటు చేసుకుంది.
జగన్ ప్రభుత్వంలో తిరుగులేని పవర్ ను ప్రదర్శించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన సతీమణి అపర్ణ హవా జగన్ ప్రభుత్వంలో ఎంతన్న అంశానికి సంబంధించిన కొత్త విషయాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు సంచలనంగా మారాయి.
జేఎన్టీయూలో ప్రొఫెసర్ గా పని చేసేవారు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి సతీమణి అపర్ణ. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన ఏడాదికే ఏపీకి వచ్చేసిన ఆమె.. శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె చేపట్టిన పదువులు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్రొఫెసర్ గా నియమితులైన కొద్ది కాలానికే డిప్యుటేషన్ మీద అటవీ.. శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్య కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు.
ఈ పదవిలో ఆమె పలు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా శాస్త్ర సాంకేతిక అంశాల మీద విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాల కంటే కూడా సివిల్ ఇంజినీరింగ్ పనులపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా అపర్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల్ని నిబంధనలకు విరుద్ధంగా నియమించుకున్న ఆమె.. రూ.15 కోట్లతో రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో ఎసర్ ఆర్ సీసీ భవనాన్ని నిర్మించారు.
ఈ భవన నిర్మాణంపై నిపుణులు పెదవి విరుస్తుననారు. అనేక ఆరోపణలు ఆమె మీద వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అపర్ణ మేడమ్ నియామకం వెనుకున్న మతలబు ఏమిటి? ఆమె హవా చంద్రబాబు సర్కారులోనూ జోరుగా సాగటం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె హవాపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్న.