ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన ప‌రిణామాలు!

Vizag Steel Plant

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా క‌ల‌క‌లం రేపిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశానికి దాదాపు తెర‌ప‌డింది. గ‌త రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై పార్ల‌మెంటులోనూ మోడీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. దీనిపై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు లేఖ‌లు రాసి స‌రిపుచ్చింది.

ప్రైవేటీక‌ర‌ణ చేయొద్ద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. ఆ త‌ర్వాత కూడా.. కేంద్రం అడుగులు వేగం గానే ప‌డ్డాయి. ఇదిలావుంటే.. కూటమి స‌ర్కారు రావ‌డంతో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు బ్రేకులు ప‌డ‌తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇంత‌లోనే పెను దుమారం రేగింది. దెక్క‌న్ క్రానిక‌ల్ ప‌త్రిక‌లో దీనికి సంబంధించి వ‌చ్చిన వార్త‌.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. సీఎం చంద్ర‌బాబు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ఓకే చెప్పార‌న్న‌ది వార్త సారాంశం.

ఇక‌, దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ కూడా చోటు చేసుకుంది. అయితే.. దీనిని చంద్ర‌బాబు ఖండించారు. కొంద‌రు దొంగ‌లు చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌రాదంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రో వైపు తాజాగా విశాఖ క‌ర్మాగారంలో ప‌ర్య‌టించిన కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కుమార‌స్వామి కూడా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేది లేద‌న్నారు. దీనిపై ఇప్ప‌టికీ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ప్రతిపాద‌న అయితే ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కానీ.. తాను క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించి కొన్ని విష‌యాలు తెలుసుకున్న మీద‌ట‌.. దీనిని ప్రైవేటీక‌రించ‌కుండా ఆపేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌ధాని మోడీకి వివ‌రిస్తాన‌ని.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి వ‌చ్చిన న‌ష్టం లేద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు విశాఖ ఉక్కు క‌ర్మాగారం కార్మికుల‌కు ఊపిరి లూదింది. మున్ముందు దీనిపై బ‌ల‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా మంత్రి ఇచ్చిన హామీలు నిజ‌మ‌య్యేలా మోడీ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.