ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలా పడ్డ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తప్పడం లేదనే చెప్పాలి. ఎన్నికల్లో ఘోరా పరాజయం కారణంగా వైసీపీని వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఇప్పుడు మరికొంతమంది నాయకులు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీనీ వీడబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన బయటకు రావడం లేదు. ఆయన పత్తా లేకుండా పోయారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతోనూ టచ్‌లో లేరని తెలిసింది. ఢిల్లీలోనే ఉంటూ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అరెస్టు భయం, వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన పని చేశారు. దీంతో నిధుల కోసం ఢిల్లీకి తరచూ వెళ్లడంతో బీజేపీ కేంద్ర పెద్దలతో కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ విధ్వంసం, అవినీతిని సీఎం చంద్రబాబు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక దోపిడీ జరిగిందన్నారు. దీనిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తనవరకూ వస్తుందేమోనని బుగ్గన టెన్షన్ పడుతున్నట్లు టాక్.
అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఆయనకు మైనింగ్, సిమెంట్ తదితర వ్యాపారాలున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించి బీజేపీలోకి వెళ్లేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. అందుకే ఆయన ఢిల్లీలోనే మకాం వేశారని అంటున్నారు. మరి బుగ్గను రాకకు బీజేపీ అంగీకరిస్తుందా? చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది చూడాలి.