ప్రొఫెస‌ర్‌గా ల‌క్ష్మీపార్వ‌తి.. అదే జ‌గ‌న్ మాయ‌!

పీహెచ్‌డీ చేసే విద్యార్థుల‌కు గైడ్‌గా ఉండాలంటే స‌బ్జెక్టుపై లోతైన అవ‌గాహ‌న‌, ఎంతో అనుభ‌వం ఉండాలి. అందుకు స‌రైన అర్హ‌త‌లు ఉండాలి. కానీ అవేమీ లేకున్నా స‌రే జ‌గ‌న్ అండ ఉంటే చాలు ఏ ప‌ద‌వి అయినా ప‌ట్టేయొచ్చు అనేందుకు ఇది మ‌రో రుజువు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న క‌టాక్షం కోసం అధికారులు ఏం చేయాలో అంతా చేశారు. ఆ క్ర‌మంలోనే వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తిని ఏయూ తెలుగు శాఖ ప్రొఫెస‌ర్‌గానూ నియ‌మించారు. ఎలాంటి అర్హ‌త‌లు లేకున్నా ఆమెకు ఆ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌డంతో పాటు చెల్లింపులు కూడా జ‌రిపిన‌ట్లు వెలుగులోకి రావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పీహెచ్‌డీ విద్యార్థుల‌కు గైడ్‌గా ఉండాలంటే పీజీ విద్యార్థుల‌కు అయిదేళ్ల పాటు బోధించిన అనుభ‌వం ఉండాలి. కానీ ఆ అర్హ‌త లేకుండానే ల‌క్ష్మీపార్వ‌తికి ఏయూ అధికారులు రాచ‌బాట ప‌రిచారు. విశ్వ‌విద్యాల‌యంలో ప‌రిశోధ‌న చేసే విద్యార్థుల్లో కొంత‌మందికి ఆమెను గైడ్‌గా నియ‌మించారు. ఈ విష‌యంపై గ‌తంలోనే విద్యార్థులు అప్ప‌టి వీసీ ప్ర‌సాద్‌రెడ్డికి కంప్ల‌యింట్ చేసినా ఆయన ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. పూర్తిగా వైసీపీ పెద్ద‌ల ఆదేశాల‌తోనే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌నిచేసిన ప్ర‌సాద్ రెడ్డి.. ల‌క్ష్మీపార్వ‌తిని గైడ్‌గా నియ‌మించారు.

పీహెచ్‌డీ గైడ్‌గా నియ‌మితురాలైన త‌ర్వాత ల‌క్ష్మీపార్వ‌తి ఆ పోస్ట్‌కు ఏదైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు. ఆమె అందుబాటులో ఉండ‌టం లేద‌ని విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేసినా అప్ప‌టి వీసీ నోరు మెద‌ప‌లేద‌ని టాక్‌. ఇత‌ర ఉద్యోగాలు చేస్తూ ప‌రిశోధ‌న‌ల‌పై ఆస‌క్తి ఉన్న‌వాళ్ల కోసం ఏయూలో టీడీఆర్ హ‌బ్ ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ అనుకూల ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల కోసం పీహెచ్‌డీలు పొందేందుకు మాత్ర‌మే ఇది ప‌ని చేస్తోంద‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.