విశాఖ ఉక్కుపై ‘వార్త‌’… టీడీపీ శ్రేణుల దాడి

టీడీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. విశాఖ‌ప‌ట్నంలోని ఆంగ్ల దిన‌ప‌త్రిక ద‌క్క‌న్ క్రానిక‌ల్ ఆఫీసు ముందున్న ప‌త్రిక బోర్డుకు నిప్పు పెట్టాయి. దీంతో ఒక్క‌సారిగా విశాఖ‌లో క‌ల‌క‌లం రేగింది.ఈ ఘ‌ట‌న‌పై ప‌త్రికా కార్యాల‌యం.. తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. డీజీపీకి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కార్యాల‌యానికి భ‌ద్ర‌త క‌ల్పించారు. కొంద‌రు టీడీపీ శ్రేణులు..(మ‌హిళ‌లు కూడా ఉన్నారు) బుధ‌వారం సాయంత్రం విశాఖ‌లోని ప‌త్రికా కార్యాల‌యానికి వ‌చ్చి.. కార్యాల‌యానికి ఉన్న బోర్డును పెట్రోలులో త‌డిపిన కాయితాలు అతికించి నిప్పు పెట్టి త‌గుల బెట్టారు. ఈ ఘ‌ట‌న క్ష‌ణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది.

ఏం జ‌రిగింది?

ఆంగ్ల దిన‌ప‌త్రిక ద‌క్క‌న్ క్రానిక‌ల్‌లో టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కార్న‌ర్ చేస్తూ.. ఓ వార్త ప్ర‌చురితమైంది. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించి.. ప్ర‌ధాని మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని, పోల‌వ‌రం.. ప్రాజెక్టుల నిర్మాణానికి త్వ‌ర‌లోనే ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో నిధులు విరివిగా కేటాయించాల‌ని చంద్ర‌బాబు అభ్య‌ర్థించారు. ఇదే విష‌యంపై ఆయ‌న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. ఇది జ‌రిగి దాదాపు వారం అయిపోయింది. అన్ని మీడియా హౌస్‌లు అప్ప‌ట్లో ఇదే చెప్పాయి.

కానీ, చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక మ‌రో కోణం కూడా ఉందంటూ..బుధ‌వారం ద‌క్క‌న్ క్రానిక‌ల్‌లో ఓ వార్త వ‌చ్చింది. అమ‌రావ‌తి నిధుల కోసం.. విశాఖ స్టీల్ ప్లాంటు విష‌యంలో తాము అడ్డుప‌డ‌బోమ‌ని ఆయ‌న కేంద్రానికి తేల్చి చెప్పారంటూ.. క్రానిక‌ల్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. చంద్ర‌బాబు.. విశాఖ స్టీల్ ప్లాంటు విష‌యంలో చేతులు ఎత్తేశార‌ని.. వ్యాఖ్యానించింది. దీనిని ప్ర‌వేటీక‌రించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కూడా.. పేర్కొంది. ఈ వార్తపై టీడీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. ఎలాంటి ఆధారాల‌తో ఈ వార్త ప్ర‌చురించారంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఈ క్ర‌మంలోనే విశాఖ‌ప‌ట్నంలోని ద‌క్క‌న్ క్రానిక‌ల్ ఆఫీసు ముందున్న బోర్డును త‌గుల బెట్టాయి.

అయితే.. మీడియాపై గ‌తంలోనూ వైసీపీ అధికారంలో ఉండ‌గా దాడులు జ‌రిగాయి. శ్రీశైలం ఎమ్మెల్యే చ‌క్ర‌పాణి రెడ్డిపై వ్య‌తిరేక వార్త‌లు రాస్తున్నారంటూ.. ఈనాడు కార్యాల‌యంపై ఆయ‌న శ్రేణులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో దీనిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన టీడీపీ కూడా.. ఇప్పుడు సంయ‌మ‌నం పాటించ‌క‌పోవ‌డం.. ఒక‌వేళ ద‌క్క‌న్ క్రానిక‌ల్ త‌ప్పుడు వార్త రాసి ఉంటే.. దానికి ఖండ‌న ఇవ్వ‌కుండా.. ఇలా దాడులు జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించ‌డంపై మాత్రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మీడియాపై దాడులు చేసి.. గ‌ళం విప్పిన వారిపై.. పెన్ను క‌దిలించిన వారిపై కేసులు పెట్టి వేధించినందుకే వైసీపీకి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పిన విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే బాట‌లో వెళ్తే ఎలా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.