రాములమ్మ కాంగ్రెస్ ను గెలుకుతుందా ?!

భారతీయ జనతాపార్టీతో 1998లో రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతి ఆలియాస్ రాములమ్మ తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో 2005లో తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించింది. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించింది. ఆ తర్వాత 2013లో టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించడంతో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది.

ఆ తర్వాత 2020 డిసెంబరులో బీజేపీలో చేరి 2023లో నవంబరు 15న బీజేపీకి రాజీనామా చేసింది. అదే నెల 17న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, కన్వీనర్ గా పనిచేసింది. శాసనసభ ఎన్నికల తర్వాత విజయశాంతి సైలెంట్ అయింది. ఆమె పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా మౌనంగా ఉన్న రాములమ్మ తాజాగా చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన నేపథ్యంలో మరోసారి మౌనం వీడి చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.

“ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని… తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణ లో బలపడనీకి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణ లో తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం…

అంతే కాదు, అసలు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గార్కి, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏమున్నది? వారి కూటమి పార్టీ బీజేపీ కి కూడా తెలంగాణల కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటది” అంటూ విజయశాంతి వ్యాఖ్యానించింది.

ఒక వైపు చంద్రబాబు రాకను కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆహ్వానించిన నేపథ్యంలో విజయశాంతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందా ? అన్న వాదన మొదలయింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.