ఏపీలో భవన నిర్మాణ రంగానికి ఊపిరి పోస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా ఆసక్తిగా మారింది. కూటమి సర్కారు వస్తూ వస్తూనే రాష్ట్రంలో కీలక పథకాల విషయంలో సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. వస్తువు వస్తూనే పోలవరంలో చంద్రబాబు పర్యటించారు. పోలవరంలో ఏర్పడిన సమస్యలు, వాటిపై అధ్యయనానికి కేంద్రాన్ని ఒప్పించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత అమరావతిపై దృష్టి సారించారు.
అమరావతిలో ప్రాజెక్టులు నిలిచిపోవడం, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరే పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకునేదిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఆయన రెండో పర్యటన అమరావతిలో చేశారు. తర్వాత సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఒకటో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులకు 4వేల కోట్లకు పైగా మొత్తాన్ని అందజేశారు.
ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణరంగం పుంజుకునేందుకు ఊపిరులూదారు. జగన్ హయాంలో ఉచితంగా ఇస్తున్న ఇసుకను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రైవేటు కాంట్రాక్టులకు ఇసుక రీచ్‌లు అప్పజెప్పడం ద్వారా భారీ ఎత్తున ఇసుక ధరలను పెంచారు.
దీంతో అత్యంత కీలకమైన భవన నిర్మాణ రంగం కుదేలైన విషయం తెలిసిందే. అదే విధంగా కార్మికులు రోడ్డున పడ్డారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయి అనేకమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక విధానంపై గతంలోనే చంద్రబాబు తీసుకొచ్చిన విధానాన్ని అనుసరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే ఏకపక్షంగా పోయిన జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేకపోయారు. ఫలితంగా ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వినియోగదారులకు 20 టన్నుల మేరకు ఉచితంగా ఇసుకను అందించనున్నారు. కేవలం రవాణాచార్జీలు, కూలి, స్థానిక సర్ చార్జీలు చెల్లిస్తే ఇసుకను ఉచితంగా ఇంటికి పంపించే అవకాశం ఏర్పడుతుంది.
తద్వారా కార్మికులకు ఉపాధి లభించడంతోపాటు భవన నిర్మాణ రంగం పుంజుకోవడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దానికి ఇది కీలక అడుగుగా చెబుతున్నారు.