కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని తాను భారత్ జోడో యాత్ర చేసినట్టు వివరించారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారన్నారు.
పేదలకు అత్యంత చేరువైన రాజశేఖరరెడ్డి.. ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్నట్టు రాహుల్ గాంధీ వివరించారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కుమార్తె షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారని.. ఆయన వారసత్వాన్ని నిలబెడతారన్న నమ్మకం కూడా తనకు ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేరువ అయ్యారని.. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా చేరువ అవుతందని విశ్వసిస్తున్నానన్నారు.
ఒక దురదృష్టకర ఘటనలో వైఎస్‌ను కోల్పోవడం తమకు ఎంతో బాధ కలిగించిందని రాహుల్ వ్యాఖ్యానిం చారు. ప్రజానేతను కోల్పోయామన్నారు. వైఎస్ నిజమైన ప్రజానాయకుడని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల కోసం నిరంతరం ఆయన కష్టపడ్డారని తెలిపారు. ప్రజలపట్ల విశ్వాసంతో.. ప్రజల్లోనే మెలిగిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని రాహుల్ వ్యాఖ్యానించారు. వైఎస్ కుమార్తెగా షర్మిల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. తండ్రి వారసత్వాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకువెళ్తారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.