“సార్ మీరు మంత్రిగారండి. మర్చిపోతున్నారా”! పాలకొల్లు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట ఇదే. దీనికి కారణం పాలకొల్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు దక్కించుకున్న ప్రజానాయకుడు నిమ్మల రామానాయుడు తాను మంత్రి అయినప్పటికీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్థానికంగా అందరిలోనూ కలిసిపోయి, అందరితోనూ కలిసిపోయి వ్యవహరించేవారు. ప్రజలంతా నా వాళ్లే, నేను ప్రజల మనిషిని అనే దృక్పథం ఆయన ముందుకు సాగారు. దీంతో చిన్న చిన్న పనులు కానీ పెద్ద పెద్ద పనులు గానీ ఆయన సాధారణ కార్యకర్తలతో కలిసి చేసేశారు.
పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు జెండాలు కట్టాల్సి వస్తే ఆయనే మైదా పూసి తాళ్లకు జండాలు అంటించారు. పరిశుభ్రత విషయానికి వస్తే రహదారులు బాగోలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం దానికి స్పందించకపోతే ఆయన నేరుగా దిగి రోడ్లు శుభ్రం చేసేవారు. స్మశానాల్లో శుభ్రం చేసినటువంటి సందర్భాలు గత ఐదేళ్లగా మనం చూసాం. అయితే ఆ వాసన ఆయనలో పోయినట్లు లేదు. నేను ఇంకా సామాన్యంగానే ఉండాలి అని ఆయన అనుకుంటున్నారేమో మొత్తానికి మంత్రి అన్న విషయాన్ని ఆయన పక్కన పెట్టారు.
తాజాగా పొలాల్లో రైతులతో కలిసి పనిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు నిమ్మల. కలుపు మొక్కలు తీస్తూ ఉత్సాహపరిచారు. నేను సాధారణ వ్యక్తినే. నేను మంత్రిని అయినప్పటికీ నేను సామాన్యుడిని. అని చెప్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ఆయన చేయాలని ప్రజలు కోరుకోవట్లేదు. అధికారులతో పనులు చేయించాలని కోరుకుంటున్నారు. జలవనులు శాఖ మంత్రిగా ఆయన మీద గురుతర బాధ్యతలు చాలా ఉన్నాయి. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి.. అక్కడి రైతులను ఉత్సాహపరచాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను పెంచడం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల బాధ్యత. అయితే ఆయన సామాన్య కార్యకర్తనే అంటూ పొలాల్లోకి దిగి పనులు చేయటం, కలుపు మొక్కలు పీకటం, చెత్త చెదారాన్ని తీయడం వంటివి ఆసక్తిగా మారాయి. ఇవి చేయడం మంచిదే అయినా ఇప్పుడు మంత్రిగా ఆ స్థాయిని ఆయన అందుపుచ్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత మేలు జరిగేలాగా వ్యవహరించాలని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు కోరుతున్న మాట. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates