బాబు మార్కు.. నేత‌లే కాదు.. అధికారులు కూడా.. !

ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తనదైన మార్కుతో పాలన ప్రారంభించిన విషయం తెలిసిందే. కూటమి అధినేత చంద్రబాబు నాయుడు యువతరానికి పెద్దపీట వేశారు. మంత్రులుగా ఎక్కువమంది యువతనే ఆయన తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త తరం నేతలకు ఎక్కువ అవకాశం కల్పించారు. అనగాని సత్య‌ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, టిజి భరత్, సత్యకుమార్ వంటి యువ నాయకులకు అవకాశం కల్పించారు. తద్వారా పాలనలో మెరుగైనటువంటి పనితనాన్ని ఆయన ఆశిస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది.

అదేవిధంగా కేవలం నేతల విషయాన్ని మాత్రమే కాకుండా అధికారుల విషయంలో కూడా చంద్రబాబు తనదైన మార్కును చూపిస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ముద్దాడ రవిచంద్ర వంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని కేంద్రం నుంచి తీసుకువచ్చారు. ఆయనను సీఎంవోలో నేరుగా నియమించారు. ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళిని కూడా ఏపీకి తీసుకువచ్చారు.

ఆయన ఏపీకి వచ్చేందుకు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నాటికి ఆయన బాధ్యతలు చేపట్ట‌నున్నారు. అదేవిధంగా కేరళకు చెందిన ఐఏఎస్ కృష్ణ తేజను కూడా ఏపీకి తీసుకురానన్నారు. ఈయనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరుకోరి ఎంచుకున్న విషయం తెలిసిందే. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈయ‌న కూడా సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్ కు చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది.

ఇక డీజీపీగా నియమితులైనటువంటి ద్వారకా తిరుమలరావు నిజాయితీపరుడైన‌ అధికారిగా తన సర్వీసులోపేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా జిఏడి అధికారులను కూడా చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. నిజాయితీకి పెద్దపీట వేస్తూ తమ సర్వీస్ లో ఎక్కువ కాలం ఎటువంటి అవినీతి అక్రమాలకు చోటు లేనటువంటి అధికారులను ఆయన నియమించారు. తద్వారా పాలనలో యువనాయకత్వంతో పాటు యువ అధికారులకు, నిజాయితీపరులైనటువంటి అధికారులకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించినట్లు అయింది.

ఏబీవీకి స‌ల‌హాదారు పోస్టు?

ఇదిలా ఉంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి సలహా దారు నియామకం చేపట్టనున్నట్లు తెలిసింది. దీనికి ఇటీవల పదవీ విరమణ చేసిన ఏబీవీ వెంకటేశ్వర రావును సలహాదారుగా నియమించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న‌ట్టు సమాచారం. గత వైసిపి హయాంలో ఏబీవీ అవమానాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఆయనపై పలు రకాల కేసులు పెట్టి వేధించడంతోపాటు కోర్టుల చుట్టూ తిప్పారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఆయన పై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు రిటైర్ అయ్యేవరకు ఆయనను విధులకు దూరంగా ఉంచటం వైసిపి హయాంలో జరిగినటువంటి ఘోర తప్పిదంగా ఐపీఎస్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సర్వీసుకు విలువనిస్తూ చంద్రబాబు నాయుడు ఏపీ పోలీస్ సేవల సలహాదారుగా  నియ‌మించనున్నట్టు తెలిసింది.